అక్షరటుడే, వెబ్డెస్క్ : Hockey Player | లక్నోలో జరిగిన విషాదకర రోడ్డు ప్రమాదంలో జాతీయ స్థాయి అథ్లెట్, హాకీ క్రీడాకారిణి జూలీ యాదవ్ (23) దుర్మరణం పాలయ్యారు. క్రీడా రంగంలో ప్రతిభ కనబరిచిన యువ క్రీడాకారిణి మరణంతో ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) క్రీడా సమాజం షాక్‌కు గురైంది.
లక్నోలోని LDA కాలనీలో ఉన్న LPS స్కూల్‌లో క్రీడా ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న జూలీ (Hockey player Julie Yadav), ఇంటర్-స్కూల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ పర్యవేక్షణకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పారా పోలీస్ స్టేషన్ పరిధిలోని మౌడా మోడ్ సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న హోండా షైన్ బైక్‌ను గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న ట్రక్కు ఢీకొట్టింది.
Hockey Player | ప్రముఖుల దిగ్భ్రాంతి..
స్థానికుల కథనం ప్రకారం.. జూలీ ముందుగా పాఠశాలకు చేరుకుని.. ఇంట్లో మర్చిపోయిన మొబైల్ తీసుకురావడానికి తిరిగి బయల్దేరింది. తిరిగి స్కూల్‌కు వస్తుండగానే ఈ ప్రమాదం జరిగింది. తీవ్ర గాయాలతో పడిపోయిన ఆమెను ప్రత్యక్ష సాక్షులు వెంటనే అంబులెన్స్ ద్వారా ట్రామా సెంటర్‌కు తరలించినా.. ఆస్పత్రి చేరుకునేలోపే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని మౌండా గ్రామానికి చెందిన జూలీ యాదవ్, జాతీయ స్థాయిలో హాకీతో పాటు అథ్లెటిక్స్ (400మీ, 800మీ రన్నింగ్) ఈవెంట్లలో కూడా బంగారు పతకాలు (Gold Medals) గెలుచుకుంది. ఆమె అఖిల భారత మహిళా హాకీ జట్టు తరపున కూడా ఆడింది. క్రమశిక్షణ, నిబద్ధత కలిగిన క్రీడాకారిణిగా, ఉపాధ్యాయురాలిగా జూలీకి మంచి పేరు ఉంది.
ఆమె హఠాన్మరణం వార్త తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలో ముంచేసింది. స్థానిక క్రీడాకారులు, సహచరులు ఆమెను ఓ “పట్టుదల, క్రమశిక్షణకు ప్రతీక”గా గుర్తు చేసుకున్నారు. జూలీ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే ట్రక్కు డ్రైవర్ వాహనంతో పారిపోయాడు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి డ్రైవర్‌ను పట్టుకునేందుకు గాలింపు చర్యలు ప్రారంభించామని పారా పోలీసులు తెలిపారు. జూలీ యాదవ్ అకాల మరణం కేవలం ఒక కుటుంబానికే కాదు, లక్నో క్రీడా సమాజానికి కూడా పూడ్చలేని లోటుగా మిగిలిపోయింది.
