అక్షరటుడే, వెబ్‌డెస్క్: Hitler police station | ఆస్ట్రియా దేశ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ పుట్టిన ఇంటిని పోలీస్ ఠాణాగా మార్చాలని నిర్ణయించింది.
సుమారు రూ.247 కోట్లతో హిట్లర్ పుట్టిన ఇంటిని ఠాణాగా పునరుద్ధరించనున్నట్లు స్థానిక అధికారులు పేర్కొన్నారు. వచ్చే ఆగస్టు నుంచి ఆ ఇంటి రెనోవేషన్ కార్యకలాపాలు మొదలు అవుతాయని ఆస్ట్రియా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
Hitler police station | ఏప్రిల్ 20న జననం
అడాల్ఫ్ హిట్లర్ 1889, ఏప్రిల్ 20న ఆస్ట్రియాలోని బ్రౌనౌ యామ్ ఇన్ అనే పట్టణంలో పుట్టారు. ఆస్ట్రియా-జర్మనీ సరిహద్దుకు సమీపంలో ఉండే సాల్జ్బర్గర్ వోర్ స్టాడ్ 15 అనే చిరునామాలో ఉన్న గృహంలో కొన్ని రోజులు ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాజీ సానుభూతిపరులు ఈ గృహాన్ని ప్రార్థనా స్థలంగా భావించి పూజిస్తారు. ఏటా హిట్లర్ జయంతినాడు నాజీ సానుభూతిపరులు ఆ ప్రాంతంలో ర్యాలీ నిర్వహిస్తారు.
ఈ నేపథ్యంలో హిట్లర్ పుట్టిన ఇంటిని ఆస్ట్రియా సర్కారు 2016లో ఒక ప్రత్యేక చట్టం రూపొందించడం ద్వారా ప్రైవేటు వ్యక్తి నుంచి తీసేసుకుంది. తాజాగా ఆ ఇంటి ప్రాంతాన్ని ఠాణాగా మార్చాలని నిర్ణయించింది.
