అక్షరటుడే, ఇందూరు: High School | నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలోని బోర్గాం(పీ) ఉన్నత పాఠశాలలో గ్రంథాలయం అందుబాటులోకి తీసుకొచ్చారు. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్, లయన్స్ క్లబ్ ఆఫ్ సంస్కృతి 320d హైదరాబాద్ ఆధ్వర్యంలో మంగళవారం పాఠశాలకు గ్రంథాలయ పుస్తకాలు, ర్యాక్లు అందజేసినట్లు ప్రధానోపాధ్యాయుడు సీహెచ్ శంకర్ తెలిపారు.
గ్రంథాలయ ఆవిష్కరణకు ముఖ్యఅతిథిగా డిస్టిక్ గవర్నర్ లయన్ అమర్నాథ్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రంథాలయ పుస్తకాలను వినియోగించుకొని చదువులలో రాణించాలని, అప్పుడే లయన్స్ క్లబ్ వంటి సంస్థలు అందించే చేయూత సఫలమవుతుందన్నారు. అనంతరం పాఠశాల గ్రంథాలయానికి మరో రూ. 10 వేలు ఇస్తున్నట్లు ప్రకటించారు. భవిష్యత్తులో కూడా తమ లయన్స్ క్లబ్ ద్వారా మరిన్ని సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు.
High School | జిల్లాలోనే ప్రతిష్ఠాత్మకం..
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సీహెచ్ శంకర్ మాట్లాడుతూ.. తమ పాఠశాల 1005 మంది విద్యార్థులతో జిల్లాలోనే ప్రతిష్ఠాత్మక స్థానం సంపాదించుకుందన్నారు. విద్యార్థులు ఆటలు, పాటలతోపాటు చదువులో ముందున్నారన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ సంస్కృతి 320d వారు రూ. 50,000/- (యాభై వేలు) వెచ్చించి విద్యార్థుల కోసం రెండు పుస్తకాల ర్యాకులు, గ్రంథాలయ పుస్తకాలు అందించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేసి, పాఠశాలకు ఈ నిధులను తెప్పించిన తెలుగు ఉపాధ్యాయుడు చింతల శ్రీనివాస గుప్తాను ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సంస్కృతి 320d అడ్వైజర్ సూర్య రాజ్, లయన్ సుజాత సూర్య రాజ్, లయన్ విజయలక్ష్మి, లయన్ సుష్మ, లయన్ శాస్త్రి, లయన్ ప్రవీణ్, లయన్ ఎం సాయిబాబు, ఉపాధ్యాయులు అరుణ్ కుమార శర్మ, సుదర్శనం, వినోద్ కుమార్, లింగయ్య, కిషన్, శ్రీకాంత్, కృష్ణవేణి, శశికళ, విద్యార్థులు పాల్గొన్నారు.