అక్షరటుడే, బాల్కొండ : Balkonda | ఆర్డీఆర్ విత్తనాలతో (RDR Seeds) అధిక లాభాలు గడించవచ్చని రుద్రూర్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. బాల్కొండలో (Balkonda) వరిపంట క్షేత్ర దినోత్సవాన్ని శుక్రవారం నిర్వహించారు. మండల కేంద్రంలోని రైతు నర్సయ్య పొలంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ శాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
Balkonda | కొత్త విత్తనాలు ఎంతో మేలు..
ఈ కార్యక్రమంలో భాగంగా ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ సుప్రజ మాట్లాడుతూ రైతులకు అందించిన ఆర్డీఆర్ RDR 1200 వరి రకం గురించి వివరించారు. అధిక దిగుబడితో పాటు ఈ విత్తనం ద్వారా రైతులు స్వయంగా విత్తనాన్ని తయారు చేసి తోటి రైతులకు సైతం విక్రయించి లాభాలు పొందవచ్చని సూచించారు. మరో శాస్త్రవేత్త డాక్టర్ వెంకటరెడ్డి మాట్లాడుతూ రైతు ఉత్పత్తిదారుల సంఘాల (FPO) ప్రయోజనాలను వివరించారు. రైతుల ఉత్పత్తులకు సరైన ధరలు లభించేందుకు, అలాగే విత్తనాలు, ఎరువులు వంటి ఇన్‌పుట్‌ను అందరూ కలిసి ఒకేసారి కొనుగోలు చేసుకొని ఖర్చులను తగ్గించుకోవచ్చని వివరించారు.
ఆర్డీఆర్ (RDR) 1200 వరిరకానికి అనేక పురుగులు, తెగుళ్లను తట్టుకునే లక్షణం ఉందని తెలిపారు. రైతులు సరైన తేమ వద్ద నిల్వ చేసుకుని రాబోయే వానాకాలంలో సాగు చేసుకోవచ్చని శాస్త్రవేత్త డాక్టర్ హిందూధర్ రెడ్డి సూచించారు. అనంతరం ఈ రకం వరి సాగు చేసిన రైతు నర్సయ్య మాట్లాడుతూ.. పూర్వం సాగు చేసిన రకాలతో పోలిస్తే అధిక దిగుబడి, పురుగు నియంత్రణలో తగ్గిన ఖర్చుతో ప్రయోజనం కలిగిందని సంతోషం వ్యక్తం చేశారు. శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులకు (Agriculture Department Officers) కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి లావణ్య, వ్యవసాయ విస్తరణ అధికారి రేష్మ, రైతుల కో–ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు నర్సయ్య, మండలంలోని వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.
