అక్షరటుడే, వెబ్‌డెస్క్: Plane crash | ఎయిరిండియా విమాన ప్రమాద ఘటనపై దర్యాప్తు చేయడానికి కేంద్ర ప్రభుత్వం (central government) ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. మూడు నెలల్లో కమిటీ రిపోర్టు ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు పౌర విమానయాన శాఖ(Civil Aviation Ministry) రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.
శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గుజరాత్ లో జరిగిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171 (Air India Flight 171)ప్రమాదంపై దర్యాప్తు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిర్ణీత గడువులోగా విచారణ పూర్తి చేయాలని ప్యానెల్‌ను ఆదేశించినట్లు రామ్మోహన్ నాయుడు చెప్పారు. “వారు కూర్చుని, వివిధ వాటాదారులతో మాట్లాడడానికి, వారి దర్యాప్తు ప్రకారం అవసరమైన ఇతర ముఖ్యమైన నిపుణులతో పాల్గొనడానికి, చర్చించడానికి మేము మూడు నెలల కాలపరిమితిని విధించాం” అని తెలిపారు.
జూన్ 12న అహ్మదాబాద్ లో (Ahmedabad) జరిగిన ఎయిరిండియా విమానం కూలిన దుర్ఘటన(Air India plane crash)లో 241 మంది ప్రయాణికులు, మెడికల్ కాలేజీ హాస్టల్ పై విమానం కూలిపోయి మంటలు రావడంతో హాస్టల్లో ఉన్న పలువురు మెడికోలు మృతి చెందిన సంగతి తెలిసిందే.
Plane Crash : వారి బాధ నాకు తెలుసు..
విమాన ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలకు సంతాపం తెలిపిన రామ్మోహన్ నాయుడు.. గత రెండు రోజులు భారంగా గడిచిందన్నారు. ప్రమాదంలో ఎవరైనా చనిపోతే ఆ కుటుంబం అనుభవించే బాధ తనకు ప్రత్యేకంగా తెలుసన్నారు. తన తండ్రి గతంలో ఇలాగే రోడ్డు ప్రమాదంలో మృతి చెందారని ఆయన చెప్పారు. విమాన ప్రమాద ఘటనను పౌర విమానయాన శాఖ సీరియస్ గా తీసుకుందన్నారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మెడికల్, ఫోరెన్సిక్, టీమ్ లతో పాటు ఐదుగురితో ఏఐబీ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ కమిటీ మూడు నెలల్లో విచారణ పూర్తి చేసి నివేదిక ఇస్తుందన్నారు.
హై లెవెల్ కమిటీ(high-level committee)తో సోమవారం భేటీ అవనున్నట్లు రామ్మోహన్ నాయుడు తెలిపారు. భద్రతా ప్రమాణాలు పెంచేలా చర్యలు చేపట్టామని తెలిపారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే బోయింగ్ 787 సిరీస్ కు చెందిన విమానాలను పరిశీలించాల్సిందిగా డీజీసీఏకు ఉత్తర్వులు ఇచ్చామన్నారు. బోయింగ్ విమానాలు దేశంలో 34 ఉన్నాయని.. ఇప్పటికే 8 విమానాలను తనిఖీ చేసినట్లు చెప్పారు. డీఎన్ఏ టెస్టులు కూడా జరుగుతున్నాయన్నారు. 24 గంటల్లోనే ప్రధాని మోదీ ప్రమాద స్థలాన్ని పరిశీలించారన్నారు.
Plane Crash : బ్లాక్ బాక్స్ సమాచారమే కీలకం..
బ్లాక్ బాక్స్ (black box)ను ఇప్పటికే స్వాధీనం చేసుకున్నామని.. అందులో ఉన్న సమాచారం కీలకంగా మారనుందని రామ్మోహన్ నాయుడు తెలిపారు. బ్లాక్ బాక్స్ లో ఉన్న సమాచారం రానున్న రోజుల్లో కీలకమని చెప్పుకొచ్చారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఛైర్మన్ నేతృత్వంలో కమిటీ వేసినట్లు తెలిపారు.
హోంశాఖ కార్యదర్శి, సివిల్ ఏవియేషన్ సెక్రెటరీ, గుజరాత్ అధికారులు, పోలీసు కమిషనర్ అహ్మదాబాద్, స్పెషల్ డైరెక్టర్ ఐబీని ఉన్నత స్థాయి కమిటీలో నియమించినట్లు చెప్పారు. అధికారులు దర్యాప్తును నిశితంగా పరిశీలిస్తున్నారని ఆయన అన్నారు. AAIB పూర్తి దర్యాప్తు చేసిన తర్వాత ఫలితాలు లేదా నివేదిక ఏమిటనే దాని కోసం మేము కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని చెప్పారు.