అక్షరటుడే, వెబ్డెస్క్ : High Court | గ్రూప్-1 పరీక్షలపై తెలంగాణ హైకోర్టు మంగళవారం సంచలన తీర్పు వెలువరించింది. గతంలో నిర్వహించిన మెయిన్స్ పరీక్షను రద్దు చేసిన న్యాయస్థానం.. మళ్లీ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది.
గతంలో ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ జాబితాను రద్దు చేస్తూ జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు(Justice Namavarapu Rajeswara Rao) ఆదేశాలు జారీ చేశారు. రీ వాల్యుయేషన్ చేయాలని ఆదేశించిన న్యాయస్థానం.. వాటి ఆధారంగా ఫలతాలు వెల్లడించాలని సూచించింది. ఒకవేళ రీవాల్యుయేషన్ సాధ్యం కాకపోతే మళ్లీ పరీక్షలు నిర్వహించాలని టీజీపీఎస్సీ(TGPSC)ని ఆదేశించింది. 8 నెలల్లోపు పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేసింది.
గ్రూప్-1 మూల్యాంకనం(Group-1 Evaluation)లో జరిగిన అవకతవకలపై చర్యలు తీసుకోవాలని, పరీక్షలను రద్దు చేసి తిరిగి నిర్వహించాలని కొంతమంది హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అదే సమయంలో ఇప్పటికే ఎంపిక ప్రక్రియ పూర్తయి ఉత్తర్వులు అందుకునే దశలో ఉన్న పరీక్షలను రద్దు చేయరాదంటూ ఎంపికైన అభ్యర్థులు కూడా కోర్టును ఆశ్రయించారు. ఇలా అభ్యర్థులు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు(High Court) మంగళవారం సంచలన తీర్పు వెలువరించింది.
High Court | సుదీర్ఘ విచారణ..
గ్రూపు 1 పరీక్ష నిర్వహణలో అవకతవకలు జరిగాయని వాటిని రద్దు చేయాలని కొందరు తమ వాదన వినిపించగా, రద్దు చేయవద్దంటూ మరికొందరు వేసిన పిటిషన్లపై జూలై 7న వాదనలు జరిగాయి. మరోవైపు, గ్రూప్-1 మెయిన్స్ సమాధాన పత్రాల మూల్యాంకనంలో ఎలాంటి లోపాలు జరగలేదని టీజీపీఎస్సీ హైకోర్టుకు తెలిపింది. అంతేకాక మెయిన్స్ పరీక్షను అత్యంత పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించామని వివరించింది. ఇప్పటికే గ్రూప్-1 పరీక్షల(Group-1 Exams) ఎంపిక ప్రక్రియ పూర్తయింది. కానీ, హైకోర్టులో కేసు విచారణ దృష్ట్యా కమిషన్ నియామక ఉత్తర్వులు జారీ చేయలేదు. తాజాగా కోర్టు తీర్పుతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది.