అక్షరటుడే, వెబ్డెస్క్ : BC Reservations | స్థానిక సంస్థల ఎన్నికల్లో (Local Body Elections) బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తూ శుక్రవారం రాత్రి ప్రభుత్వం జీవో విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనిపై మేడ్చల్ (Medchal) మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లి మండలం కేశవాపూర్ గ్రామానికి చెందిన బుట్టెంగారి మాధవరెడ్డి (Madhava Reddy) హైకోర్టు (High Court)ను ఆశ్రయించారు.
మాధవరెడ్డి పిటిషన్పై శనివారం సాయంత్రం కోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ (Governor) దగ్గర బిల్లు పెండింగ్‌లో ఉండగా.. జీవో ఎలా ఇస్తారని కోర్టు ప్రశ్నించింది. కోర్టుల జోక్యం ఉండకూడదంటే పది రోజులు ఎన్నికలు వాయిదా వేయాలని సూచించింది. పిటిషనర్ల తరఫున సీనియర్ లాయర్లు ప్రభాకర్, మయూర్ రెడ్డి వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్ రెడ్డి ఆన్లైన్లో వాదనలు వినిపించారు.
BC Reservations | అక్టోబర్ 8కి వాయిదా
రిజర్వేషన్లు 50 శాతం మించకుండా ఉండాలి అనే నిబంధన ఉంది కదా అని కోర్టు ప్రశ్నించింది. దసరా (Dussehra) తర్వాత ఈ పిటిషన్ విచారణ చేపట్టాలని ఏజీ కోరారు. దీనికి న్యాయస్థానం స్పందిస్తూ.. అప్పటి వరకు మీరు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వమని చెబితే అలానే చేస్తామంది. హడావుడిగా జీవో ఎందుకు జారీ చేశారని, ఎన్నికలకు మరో మూడు నెలల సమయం కావాలని కోర్టులో పిటిషన్ వేయొచ్చు కదా అని జడ్జి ప్రశ్నించారు. దీనిపై ప్రభుత్వ నిర్ణయం చెప్పాలని ఏజీని ఆదేశించారు. సోమవారం ప్రభుత్వ నిర్ణయం చెబుతామని ఏజీ కోర్టుకు తెలిపారు.
నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారని కోర్టు ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. ఏ క్షణమైనా నోటిఫికేషన్ విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఈసీ తెలిపింది. దీంతో నోటిఫికేషన్ వచ్చినా పిటిషన్లపై విచారణ చేపడుతామని కోర్టు స్పష్టం చేసింది. అనంతరం విచారణను వచ్చే నెల 8కి వాయిదా వేసింది.