
అక్షరటుడే, హైదరాబాద్: High Court | డీఎస్సీ-2003 నోటిఫికేషన్ కింద కొలువుదీరిన ఉపాధ్యాయుల విషయంలో తెలంగాణ హైకోర్టు (Telangana High Court) కీలక తీర్పు వెలువర్చింది. వారు పాత పెన్షన్ విధానానికి అర్హులంటూ తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో సెప్టెంబరు, 2004కు ముందు గ్రూప్–2 నోటిఫికేషన్ (Group-2 notification) ద్వారా నియమితులైన ఉద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. తాము కూడా పాత పెన్షన్‌కు అర్హులమేనని పేర్కొంటున్నారు.
2003 నోటిఫికేషన్ కింద నియమితులైన తమకు సెప్టెంబరు 1, 2004 నుంచి అమల్లోకి వచ్చిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (contributory pension scheme) వర్తింపజేయడాన్ని సవాలు చేస్తూ సదరు ఉపాధ్యాయులు హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఈ క్రమంలో వీటిపై మంగళవారం (జులై 29) జస్టిస్ నగేశ్ భీమపాక (Justice Nagesh Bhimapaka) విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు రవిచందర్, బొబ్బిలి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. 2003 నోటిఫికేషన్ కింద నియమితులైన వారికి 2004 ఆగస్టు 31 వరకు అమల్లో ఉన్న పాత పెన్షన్ పథకాన్ని వర్తింపజేయాలని కోరారు. సెప్టెంబరు 1, 2004 నుంచి అమల్లోకి వచ్చిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం వర్తింపజేయడం సరికాదని పిటిషన్ర్ల తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు.
High Court | ఏమిటీ ఈ నోటిఫికేషన్..
2003 కంటే ముందు ఉన్న ఉపాధ్యాయ పోస్టుల ఖాళీల భర్తీకి 2003లో జారీ అయిందని న్యాయవాదులు గుర్తుచేశారు. ఎంపిక ప్రక్రియ మొత్తం కూడా 2004 జూన్ కల్లా పూర్తయిందని తెలిపారు. పాలనాపరమైన జాప్యం వల్ల 2005 నవంబరులో నియామక ఉత్తర్వులు ఇచ్చారని పేర్కొన్నారు. వాదోపవాదాలు విన్న న్యాయమూర్తి.. పరిపాలనాపరమైన కారణం వల్లనే నియామకాలు ఆలస్యంగా జరిగినట్లు తేలినందున.. సదరు టీచర్లు పాత పెన్షన్ పథకానికి (old pension scheme) అర్హులేనని స్పష్టం చేశారు. 2003 డీఎస్సీ టీచర్లకు పాత పెన్షన్ పథకం అమలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు.
High Court | మరి గ్రూప్–2 ఉద్యోగుల మాటేమిటి..?
ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో 2003 వరకు ఖాళీగా ఉన్న గ్రూప్–2 పోస్టులకు (Group-2 posts) సంబంధించిన నోటిఫికేషన్ సెప్టెంబరు, 2004కు ముందే వెలువడింది. ఇందుకు సంబంధించిన పరీక్షను అప్పటి ఏపీపీఎస్సీ 2005లో నిర్వహించి, 2007లో ఉద్యోగాల్లోకి తీసుకుంది.
కాగా, నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (contributory pension scheme) అనేది అసలు అమల్లోనే లేదనేది సదరు గ్రూప్–2 నోటిఫికేషన్ కింద నియమితులైన ఉద్యోగుల వాదన. తమకు పాత పెన్షన్ పథకం వర్తింపజేయాలని వీరు కూడా ఎప్పటి నుంచో విన్నవిస్తున్నారు. తాజాగా 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు (2003 DSC teachers) ఓల్డ్ పెన్షన్ స్కీం వర్తింపజేయాలని హైకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో తాము కూడా న్యాయం కోసం పోరాడతామని పేర్కొంటున్నారు.