అక్షరటుడే, వెబ్డెస్క్ : GHMC Wards | జీహెచ్ఎంసీ వార్డుల విభజనపై హైకోర్టు (High Court) కీలక తీర్పు వెలువరించింది. అభ్యంతరాల స్వీకరణకు మరో 2 రోజులు గడువు పొడిగించాలని ఆదేశించింది. రెండు రోజుల్లో అభ్యంతరాలను సమర్పించాలని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జీహెచ్ఎంసీ (GHMC) పరిధిని పెంచింది. అనంతరం వార్డులను విభజించింది. 150 ఉన్న వార్డుల సంఖ్యను 300కు పెంచింది. వార్డుల విభజనపై ఈ నెల 17 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తామని గతంలో అధికారులు తెలిపారు. వార్డుల విభజన సక్రమంగా జరగలేదని పలువురు కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం బుధవారం తీర్పు వెలువరించింది. మరో రెండు రోజులు అభ్యంతరాల స్వీకరణకు గడువు పెంచడంతో పాటు, డీలిమిటేషన్ మ్యాప్, జనాభా వివరాలను 24గంటల్లో పబ్లిక్ డొమైన్లో పెట్టాలని ఆదేశించింది.
GHMC Wards | స్టే ఇవ్వాలని కోరగా..
జీహెచ్ఎంసీ డివిజన్ల సంఖ్య పెంపుపై ప్రభుత్వం జారీ చేసిన ప్రాథమిక నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ పలువురు కోర్టును ఆశ్రయించారు. పిటిషనర్లు, ప్రభుత్వం తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవోపై స్టే ఇవ్వాలని పిటిషనర్లు కోరారు. పిటిషనర్ల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుంటామని అడ్వొకేట్ జనరల్ కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. అభ్యంతరాల స్వీకరణ గడువు పొడిగించింది.