అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Akhanda 2 | అఖండ-2 నిర్మాతలపై తెలంగాణ హైకోర్టు (Telangana High Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులు అంటే లెక్కలేదా అని ప్రశ్నించింది. కోర్టు ధిక్కారణ పిటిషన్ విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.
బాలయ్య హీరో (Hero Balakrishna)గా బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ –2 శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా టికెట్ రేట్ల పెంపునకు అనుమతి ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) గతంలో జీవో జారీ చేసింది. మల్టిప్లెక్స్‌లో రూ.100, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.50 పెంచడానికి అనుమతి ఇచ్చింది. దీనిపై పలువురు కోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం రేట్ల పెంపు జీవోను కొట్టివేసింది. అయినా కూడా ఆన్లైన్లో పెంచిన రేట్లకు టికెట్లు విక్రయిస్తున్నారు.
Akhanda 2 | పెంచిన రేట్లతోనే..
కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి గురువారం రాత్రి ప్రీమియర్ షో వేశారని, అధిక ధరకు టికెట్లను విక్రయించారని విజయ్ గోపాల్ అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం నిర్మాతలతో పాటు బుక్ మై షో (Book My Show)పై ఆగ్రహం వ్యక్తం చేసింది. తమకు ఉత్తర్వులు అందే లోపే ప్రేక్షకులు టిక్కెట్లు కొనుగోలు చేశారని బుక్‌మై షో తరఫు న్యాయవాది పేర్కొన్నారు. అయితే ఇప్పుడు పెంచిన రేట్లతో టికెట్లు విక్రయిస్తున్నారా లేదా అని కోర్టు ప్రశ్నించింది. కాగా శుక్రవారం మధ్యాహ్నం సైతం బుక్ మై షోలో పెంచిన టికెట్ రేట్లు చూపిస్తుండటం గమనార్హం. బుక్ మై షోపై కోర్టు ధిక్కారణ చర్యలు ఎందుకు చేపట్టకూడదని అడిగింది. అనంతరం విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేసింది.కాగా అఖండ–2 విడుదల కావడంతో బాలయ్య ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. మరోసారి బోయపాటి – బాలకృష్ణ కాంబోలో హిట్ పడిందనే టాక్ వినిపిస్తోంది. బాలయ్య డైలాగ్‌లు, బోయపాటి (Director Boyapati) యాక్షన్ సన్నివేశాలు, థమన్ బీజీఎం సినిమాను ఓ రేంజ్లో నిలబెట్టాయని అభిమానులు చెబుతున్నారు.