అక్షరటుడే, వెబ్డెస్క్: Hiccups | వెక్కిళ్లు రావడం చాలా సాధారణ విషయమే అయినా, అవి ఒక్కసారి మొదలైతే ఎప్పుడు తగ్గుతాయా అనిపిస్తుంది. ముఖ్యంగా పది మందిలో ఉన్నప్పుడు వెక్కిళ్లు వస్తే కలిగే అసౌకర్యం అంతా ఇంతా కాదు. సాధారణంగా వెక్కిళ్లు వాటంతట అవే తగ్గిపోతుంటాయి. కానీ కొన్నిసార్లు ఎంతకీ తగ్గకుండా విసిగిస్తుంటాయి. ఇలాంటి సమయంలో ఖరీదైన మందులు అవసరం లేకుండా, ఇంట్లోనే అందుబాటులో ఉండే వస్తువులతో వాటికి ఎలా చెక్ పెట్టవచ్చో ఆరోగ్య నిపుణులు ఐదు అద్భుతమైన మార్గాలను సూచించారు.
చల్లటి నీరు: Hiccups | చాలా మంది వెక్కిళ్లు రాగానే గటగటా గ్లాసుడు నీళ్లు తాగేస్తారు. కానీ నిపుణుల సూచన ప్రకారం, అలా తాగడం కంటే చల్లటి నీటిని కొద్దికొద్దిగా టీ తాగినట్లు సిప్ చేయడం వల్ల ఫలితం ఉంటుంది. సుమారు 8 నుంచి 10 సార్లు ఇలా చిన్న చిన్న గుటకలు వేయడం ద్వారా మన శరీరంలోని వేగస్ నర్వ్ స్టిమ్యూలేట్ అయ్యి వెక్కిళ్లు తగ్గుతాయి.
పేపర్ బ్యాగ్: Hiccups | ఇది వినడానికి కాస్త కొత్తగా ఉన్నా చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఒక ఖాళీ పేపర్ కవర్ను ముక్కు, నోటికి అడ్డంగా పెట్టుకుని అందులోకి గాలిని వదులుతూ, మళ్ళీ అదే గాలిని పీల్చుకోవాలి. ఇలా చేయడం వల్ల రక్తంలో కార్బన్ డయాక్సైడ్ స్థాయి పెరిగి, డయాఫ్రామ్ కండరాలు రిలాక్స్ అవుతాయి. ఫలితంగా 5-6 సార్లు ఇలా చేయగానే వెక్కిళ్లు ఆగిపోతాయి.
నిమ్మకాయ: Hiccups | వెక్కిళ్లు అస్సలు తగ్గనప్పుడు ఒక నిమ్మకాయ ముక్కను నోట్లో వేసుకుని చప్పరించాలి. నిమ్మలోని పులుపు మన శరీర నరాల వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపుతుంది. ఆ పుల్లటి రుచికి మన శరీరం స్పందించే తీరు మారి వెక్కిళ్లు తక్షణమే నిలిచిపోతాయి.
శ్వాసను బిగబట్టడం: Hiccups | శ్వాసకు సంబంధించిన వ్యాయామాల ద్వారా వెక్కిళ్లను సులభంగా అదుపు చేయవచ్చు. గాలిని గట్టిగా లోపలికి పీల్చుకుని, కనీసం 10 నుంచి 15 సెకన్ల పాటు ఊపిరి బిగబట్టాలి. ఇలా చేయడం వల్ల డయాఫ్రామ్ కండరంపై ఒత్తిడి తగ్గి వెక్కిళ్లు ఆగిపోతాయి.
బాడీ పోశ్చర్: వెక్కిళ్లు వస్తున్నప్పుడు నిటారుగా కూర్చోవడం చాలా ముఖ్యం. తలను కాస్త ముందుకు వంచి, గొంతులో ఏదైనా మింగుతున్నట్లుగా కదలికలు చేయాలి. దీనివల్ల ఆహార వాహికపై ఉన్న ఒత్తిడి తగ్గి, వెక్కిళ్లు రావడం నిలిచిపోతుంది.