అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Weather Updates | తెలంగాణలో సోమవారం భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తాయని వాతావరణ శాఖ (IMD) అధికారులు తెలిపారు.
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం వాన దంచికొట్టింది. సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, కామారెడ్డి, జిల్లాల్లో భారీ వర్షం పడింది. సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు వరుణుడు తన ప్రతాపం చూపాడు. సోమవారం మధ్యాహ్నం వరకు వాతావరణం పొడిగా ఉంటుంది. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు పలు చోట్ల కుండపోత వాన కురుస్తుంది.
Weather Updates | ఆ జిల్లాలకు అలెర్ట్
మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, రంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెం, భువనగిరి, హన్మకొండ, సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Weather Updates | హైదరాబాద్ నగరంలో..
హైదరాబాద్ (Hyderabad) నగరం ఆదివారం కురిసిన వర్షాలతో అతలాకుతలం అయింది. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు నగరంలో వాన దంచికొట్టింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై నీరు నిలిచి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ జామ్ కావడంతో గంటల కొద్ది రోడ్లపై చిక్కుకుపోయారు. సోమవారం సైతం నగరంలో సాయంత్రం నుంచి రాత్రి వరకు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Weather Updates | వర్షపాతం వివరాలు
రాష్ట్రంలో ఆదివారం ఉదయం 8:30 గంటల నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు అత్యధికంగా సిద్దిపేట జిల్లా నారాయణపేటలో 245మి.మీ. వర్షం కురిసింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో 128మి.మీ, హైదరాబాద్‌లని ముషీరాబాద్‌లో 124, కామారెడ్డి జిల్లా సోమూరులో 108.8, మేడ్చల్ జిల్లా కాప్రాలో 103.3, హైదరాబాద్‌లోని మారేడ్‌పల్లిలో 101.8, షేక్‌పేటలో 99 మి.మీ. వర్షం కురిసింది.
Weather Updates | ఆందోళనలో రైతులు
రాష్ట్రంలో ప్రస్తుతం పంటలు పొట్ట, ఈనిక దశలో ఉన్నాయి. ముందస్తుగా సాగు చేసిన పొలాలు మరో 15 రోజుల్లో కోతకు రానున్నాయి. ఈ తరుణంలో కురుస్తున్న వర్షాలతో పంటలకు నష్టం వాటిల్లుతుందని రైతులు (Farmers) ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది అక్టోబర్ మూడో వారం వరకు వర్షాలు పడుతాయని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.