అక్షరటుడే, వెబ్‌డెస్క్: Weather Updates | తెలంగాణలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం భారీ వర్షాలు(Heavy Rains in Telangana) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిశాయి. గురువారం వర్షాలు కాస్త తెరిపినివ్వగా.. శుక్రవారం నుంచి మళ్లీ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ (Meteorological Department) తెలిపింది.
ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, రంగారెడ్డి, మెదక్ జిల్లాలకు వర్ష సూచన ఉంది. హైదరాబాద్ (Hyderabad city) సిటీలోనూ భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు. గంటకు 30-40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Weather Updates | జోరుగా వరి నాట్లు
అల్పపీడన ప్రభావంతో నాలుగు రోజులు వర్షాలు పడటంతో రాష్ట్రంలో వరి నాట్లు జోరందుకున్నాయి. పలు ప్రాంతాల్లో ఇప్పటికే నాట్లు పూర్తికాగా.. కొన్ని జిల్లాల్లో తాజాగా కురిసిన వర్షాలతో నాట్లు వేయడం ప్రారంభించారు. మరోవైపు వరుసుగా కురుస్తున్న వర్షాలతో వాగులు పారుతున్నాయి. చెరువుల్లోకి కొత్త నీరు చేరి జలకళను సంతరించుకుంటున్నాయి. దీంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే గోదావరి, మంజీర నదుల్లో వరద ప్రవాహం లేకపోవడంతో ఆయా నదులపై గల ప్రాజెక్టులు వెలవెలబోతున్నాయి.
మంజీరాపై గల సింగూర్, నిజాంసాగర్‌కు ఇన్‌ఫ్లో లేదు. నిజాంసాగర్ ప్రాజెక్ట్(Nizamsagar Project)లో ప్రస్తుతం నీటిమట్టం ఆశాజనకంగా ఉండటంతో రైతులు సాగు పనులు ప్రారంభించారు. మరోవైపు ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రధాయిని శ్రీరామ్‌సాగర్‌కు సైతం వరద రావడం లేదు. అయితే ప్రాజెక్ట్‌కు గతేడాది జులైలో భారీ ఇన్‌ఫ్లో వచ్చి నిండుకుండలా మారింది. ఇప్పుడు కూడా జులైలో ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురిస్తే వరద వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తడంతో వచ్చిన వరద వచినట్లు ఎస్సారెస్పీలోకి చేరనుంది.