అక్షరటుడే, వెబ్డెస్క్:Heavy Rains | తెలంగాణ(Telangana) వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. రెండ్రోజులుగా అన్ని ప్రాంతాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. గత కొద్ది రోజులుగా వర్షాలు ముఖం చాటేయడంతో అన్నదాతలు(Farmers) తీవ్ర ఆందోళనకు గురయ్యారు. నాట్లు వేయడానికి అదను దాటుతుండడం, వేసిన పంటలు ఎండుముఖం పడుతుండడంతో కలవరం చెందారు. అయితే, రెండ్రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. అన్ని జిల్లాల్లో నాట్లు జోరందుకున్నాయి.
Heavy Rains | లోటు వర్షపాతం..
వర్షాకాలం ఆరంభానికి ముందే విస్తారంగా వర్షాలు కురిశాయి. మే నెలాఖరులో దాదాపు వారం రోజులు కురిసిన వర్షాలు రైతులను మురిపించాయి. దీంతో అన్నదాతలు ఆనందంగా వ్యవసాయ పనులు ప్రారంభించారు. మక్క, పత్తి, పసుపు, పప్పు దినుసులు సాగు చేశారు. అలాగే, నార్లు కూడా పోసుకున్నారు. అయితే, గత 20 రోజులుగా వానలు ముఖం చాటేశాయి. రుతుపవనాలు విస్తరించినా వాతావరణం(Weather) అనుకూలించక పోవడంతో వర్షాలు కురియలేదు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా లోటు వర్షపాతం నెలకొంది. 621 మండలాలకు గాను 330 ముండలాల్లో లోటు వర్షపాతమే నమోదైంది. దాదాపు 100 మండలాల్లోనే సాధారణ వర్షపాతం నమోదు కాగా, కేవలం 10 చోట్ల మాత్రమే నగటు కంటే ఎక్కువగా వానలు కురిశాయి. లోటు వర్షాల వల్ల వ్యవసాయ పనులకు తీవ్ర అంతరాయం కలిగింది. నార్లు ముదిరి పోతుండగా, వేసిన పంటలు వాడిపోయాయి. ఈ నేపథ్యంలో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
Heavy Rains | విస్తారంగా వర్షాలు..
అన్నదాతలను మురిపిస్తూ రెండు రోజులుగా భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తున్నాయి. ఉమ్మడి పది జిల్లాల్లోనూ వానలు దంచి కొడుతున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నాట్లు జోరందుకున్నాయి. ఈ సీజన్‌లో మొత్తం 1.30 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. కానీ, ఇప్పటిదాకా సరైన వర్షాలు లేని కారణంగా వ్యవసాయ పనులకు అంతరాయం కలిగింది. దాదాపు 70 లక్షల ఎకరాల్లో ఎకరాల్లో వరి సాగవుతుందని అంచనా వేయగా, ఇప్పటిదాకా కేవలం 25 శాతం మాత్రమే నాట్లు పూర్తయ్యాయి. ఆరుతడి పంటలైన పత్తి, మొక్కజొన్న మాత్రం అంచనాలకు మించి సాగయ్యాయి. ప్రస్తుతం జోరుగా వర్షాలు కురుస్తున్న తరుణంలో నాట్లు జోరందుకున్నాయి. ఆగస్టు మొదటి వారం వరకు నాట్లు పూర్తయ్యే అవకాశముందని చెబుతున్నారు.