అక్షరటుడే, బోధన్: Manjeera river | ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. నదులు, వాగులు ఉగ్రరూపం దాల్చాయి. పలు చోట్ల రోడ్లు తెగిపోయాయి. దీంతో రాకపోకలు సైతం నిలిచిపోయాయి. ఇక మెదక్, కామారెడ్డి జిల్లాల్లో కురిసిన కుండపోత వర్షాలతో నిజాంసాగర్‌కు వరద పోటెత్తుతోంది. దీంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తి పెద్ద ఎత్తున వరద నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ క్రమంలో మంజీర నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పరీవాహక గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పలు గ్రామాల్లోకి వరద నీరు రావడంతో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.
Manjeera river | రెండు గ్రామాల నుంచి 30 కుటుంబాల తరలింపు
మంజీర నది ఉగ్రరూపం దాల్చడం సాలూర మండలంలోని రెండు గ్రామాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. హున్సాతో పాటు మందర్నా గ్రామాల్లోకి నీరు వచ్చింది. దీంతో ఈ రెండు ఊర్లలోని 30 కుటుంబాలను పునరావాస కేంద్రానికి తరలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా సాలూర తహశీల్దార్ శశిభూషణ్ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. భారీ వర్షాలు కురస్తుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Manjeera river | జలదిగ్బంధంలో హంగర్గ
బోధన్ మండలం హంగర్గ జలదిగ్బంధంలో చిక్కుకుంది. రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురుస్తుండడంతో ప్రాజెక్టులు భారీ వరద పోటెత్తుతోంది. శ్రీరాంసాగర్ బ్యాక్ వాటర్ ఒకవైపు, మరోవైపు నిజాంసాగర్ గేట్లు తెరవడతో మంజీర ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో హంగర్గ గ్రామం నీట మునిగింది. బోధన్ మండల తహశీల్దార్ విఠల్ శుక్రవారం ఉదయం గ్రామాన్ని సందర్శించారు. గ్రామస్థులను పునరవాసానికి తరలిస్తున్నారు. అవసరమైన సహాయక చర్యలను చేపట్టారు.