అక్షరటుడే, ఇందూరు : Heavy Rains | ఉమ్మడి జిల్లాలో వాన దంచికొట్టింది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం వరకు తెరిపినివ్వకుండా వర్షం పడుతూనే ఉంది. రాత్రి పూట భారీ వర్షం కురిసింది (Heavy rain fall). దీంతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు నిండి అలుగు పారుతున్నాయి. ప్రాజెక్ట్‌లు (Projects) జలకళను సంతరించుకున్నాయి. భారీ వర్షంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్ఆనరు.
నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా (Nizamabad district) శనివారం 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. అత్యధికంగా కోటగిరి 6.3 సెంటీమీటర్లు, వర్ని 5.3, మోపాల్ 4.5 సెం.మీ, రుద్రూర్లో 4.3 సెం.మీ. వర్షం కురిసింది. అత్యల్పంగా సాలూర 0.4, బోధన్ 0.5 సెం. మీ, మోర్తాడ్, మెండోరా 0.6 సెం.మీ వర్షం పడింది. జిల్లాలోని 15 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదు కాగా, 16 మండలాల్లో లోటు వర్షపాతం నమోదయింది. కామారెడ్డి జిల్లా (Kamareddy District) మద్నూర్‌లో 11 సెం.మీ వర్షపాతం నమోదు కావడం గమనార్హం.
Heavy Rains | నిండిన చెరువులు.. ప్రాజెక్ట్‌లకు భారీగా ఇన్‌ఫ్లో
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,075 చెరువులు, కుంటలు ఉన్నాయి. ఇందులో పెద్ద చెరువులు సుమారు 700 వరకు ఉన్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు సగానికి పైగా చెరువులు, కుంటలు నిండి అలుగు పారుతున్నాయి. కామారెడ్డిలోని పెద్ద చెరువు సైతం మత్తడి దూకుతుంది. శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్ట్‌కు (Sriram Sagar project) భారీగా వరద వస్తోంది. జలాశయంలోకి 89 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. నీటినిల్వ 51.6 టీఎంసీలకు చేరింది. ఇన్‌ఫ్లో మరింత పెరిగే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రాజెక్ట్ దిగువన గల ప్రజలు నదిలోకి వెళ్లొద్దని కోరారు. కామారెడ్డి జిల్లాలోని పోచారం ప్రాజెక్ట్‌కు (Pocharam Project) సైతం భారీగా ఇన్‌ఫ్లో వస్తోంది. ఇప్పటికే డ్యామ్ నిండటంతో కట్టపై నుంచి నీరు పొంగి పొర్లుతోంది. మరోవైపు నిజాంసాగర్ ప్రాజెక్ట్‌కు (Nizamsagar Project) సైతం భారీగా వరద వస్తోంది. సింగూరు గేట్లు ఎత్తడం, పోచారం ప్రాజెక్ట్ అలుగు పారుతుండటంతో ఆ నీరు నిజాంసాగర్‌లోకి చేరుతోంది. ప్రస్తుతం 20 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. కల్యాణి ప్రాజెక్ట్ (Kalyani project) కూడా నిండుకుండలా మారడంతో రెండు గేట్లు ఎత్తి అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
Heavy Rains | నిలిచిన రాకపోలు
ఉమ్మడి జిల్లాలోని పలు వాగులు ఉదృతంగా పారుతున్నాయి. రాహదారులపై నుంచి నీరు ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సిరికొండ మండలంలోని (Sirikonda Mandal) గడ్కోలు వాగుకు భారీ వరద వస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. తాడ్వాయి మండలం సంతాయిపేట భీమేశ్వర ఆలయం ఉప్పొంగి పారుతోంది. ఇందల్వాయి మండలం సిర్నాపల్లి రైల్వే స్టేషన్ వద్ద, సిరికొండ మండలం తూంపల్లిలో వంతెనలపై నుంచి వాగులు పారుతున్నాయి. దీంతో ఆయా పోలీసులు ఆయా మార్గాల్లో రాకపోకలు నిలిపి వేశారు.
Heavy Rains | అధికారుల అప్రమత్తం
ఎడతెరిపి లేని వర్షం కారణంగా నిజామాబాద్ (Nizamabad), కామారెడ్డి జిల్లాల (Kamareddy District) అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే సంబంధిత శాఖ అధికారులకు సెలవులు రద్దు చేశారు. కలెక్టరేట్లలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. వర్షాల నేపథ్యంలో జిల్లాలో ఎటువంటి సమస్యలు ఎదురైనా సమాచారం అందించాలని నిజామాబాద్ కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. నదీ పరివాహక ప్రాంతాలు, చెరువుల్లో చేపల వేట నిషేధించారు.
Heavy Rains | జాగ్రత్తలు అవసరం
వర్షాల నేపథ్యంలో విద్యుత్, పాత భవనాలతో జాగ్రత్తలు ఎంతో అవసరం. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు. ఏదైనా విద్యుత్ సంబంధిత సమస్యలు ఎదురైతే తమ పరిధిలోని అధికారులకు సమాచారం అందించాలని, స్వయంగా మరమ్మతులు చేపట్టొద్దన్నారు. అలాగే పాత భవనాల్లో ఉండే వారు ఖాళీ చేయాలని అధికారులు పేర్కొన్నారు. గాంధారి మండలం (Gandhari mandal) జువ్వడి గ్రామానికి చెందిన చాకలి సంగవ్వ ఇల్లు శనివారం ఉదయం కూలిపోయింది. అయితే ఇంట్లో ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. వర్షాలకు పాత ఇళ్లు కూలే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. అలాగే ప్రజలు అత్యవసరం అయితేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని సూచించారు.