అక్షరటుడే, కామారెడ్డి/లింగంపేట : Heavy Rains | కామారెడ్డి (Kamareddy) జిల్లా వ్యాప్తంగా వర్షం బీభత్సం సృష్టించింది. మంగళవారం రాత్రి నుంచి వర్షం పడుతూనే ఉంది. కుండపోత వానతో జన జీవనం స్తంభించిపోయింది. వాగులు, వంకలు ఉప్పొంగి పారుతున్నాయి.
కామారెడ్డి జిల్లా కేంద్రంలో వాన దంచికొట్టింది. పట్టణంతో పాటు జిల్లావ్యాప్తంగా రాత్రి నుంచి వర్షం పడుతోంది. బుధవారం సైతం జిల్లాలో అతి భారీ వర్షాలు (Very Heavy Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. వర్షాలతో పట్టణంలోని రోడ్లు జలమయం అయ్యాయి. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) క్షేత్రస్థాయిలో పర్యటించి నీరు నిల్వకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
Heavy Rains | జలమయమైన రోడ్లు
కామారెడ్డి పట్టణంలోని ప్రధాన రోడ్లు జలమయం కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వినాయక చవితి సందర్భంగా బయటకు వెళ్లి పూజ సామగ్రి కొనుగోలు చేద్దామన్నా వాన తెరిపినివ్వడం లేదు. మరోవైపు రోడ్లపై నీరు చేరడంతో పట్టణ ప్రజలు అవస్థలు పడుతున్నారు. పట్టణంలోని జీవదాన్, లయోల స్కూల్ చౌరస్తా వద్ద విద్యానగర్ కాలనీ నుంచి వచ్చే నీరు రహదారిని బ్లాక్ చేసింది. దీంతో ఒకవైపు నుంచి మాత్రమే రాకపోకలు సాగిస్తున్నారు. నిజాంసాగర్ చౌరస్తా వద్ద కొత్త బస్టాండ్ దారిలో వరద నీరు పారుతోంది. చౌరస్తా నుంచి కోర్టుకు వెళ్లే మార్గంలో కమాన్ వద్ద నీరు నిలిచిపోయింది. రైల్వే స్టేషన్ రోడ్డులో సైతం నీరు చేరింది.
Heavy Rains | నిలిచిన రాకపోకలు
కామారెడ్డి నుంచి ఎల్లారెడ్డి (Yellareddy) రహదారిలో లింగంపేట మండలం మెంగారం వద్ద వరద ఉధృతంగా పారుతోంది. దీంతో రోడ్డు కోసుకుపోయింది. దీంతో పోలీసులు బారీకేడ్లు ఏర్పాటు చేసి ఆ మార్గంలో రాకపోకలు నిలిపివేశారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని ఎస్సై దీపక్ కుమార్ సూచించారు. లింగంపేట మండలం కంచిమల్, మెంగారం చెరువులు అలుగు పారుతున్నాయి. లింగంపేట పెద్దవాగు, సంతాయిపేటలో భీమేశ్వర వాగు, పాల్వంచ వాగులు ఉధృతంగా పారుతున్నాయి. చెరువులు అలుగు పారుతుండటం, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పలు ప్రాంతాల్లో పంట పొలాలు నీట మునిగాయి.