అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Heavy Rains | హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో గురువారం భారీ వర్షం కురిసింది. దీంతో ఖైరతాబాద్, ఎంఎస్ మక్తా వంటి ప్రాంతాలు జలమయమయ్యాయి. సీబీఐ క్వార్టర్స్(CBI Quarters)లోని పలు నివాసాల్లోకి నీళ్లు చేరాయి. దీంతో నిత్యావసరాలు, ఇతర సామన్లు తడిసిపోయాయి.
ఇళ్ల నుంచి ప్రజలు బయటకు రావడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బేగంపేటలోని పలు అపార్ట్‌మెంట్ల సెల్లార్లలోకి నీళ్లు చేరాయి. రసూల్‌పురాలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. ముషీరాబాద్ నియోజకవర్గంలోని బాగ్‌లింగంపల్లి, శ్రీరాంనగర్ బస్తీల్లోకి నడుం లోతులోకి నీళ్లు వచ్చాయి. భారీ వర్షం కారణంగా స్థానికులకు తీవ్ర అసౌకర్యం కలిగిందని, వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగిందని అధికారులు తెలిపారు. మోటార్లతో నీటిని ఎత్తిపోసేందుకు జీహెచ్ఎంసీ ప్రయత్నాలు చేపట్టింది.
Heavy Rains | ఆరెంజ్ అలర్ట్..
ఇప్పటికే భారీ వర్షాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న హైదరాబాద్(Hyderabad)లో మరిన్ని వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ(Meteorological Department) సాధారణంగా తెలిపింది. రాబోయే 48 గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. సెప్టెంబర్ 18 మరియు 19 తేదీల్లో తెలంగాణ(Telanagana)కు ఐఎండీ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. మెరుపులు, ఈదురుగాలులతో కూడిన ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. సెప్టెంబర్ 20న హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ సహా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Heavy Rains | మృతదేహం లభ్యం
హబీబ్ నగర్ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా సెప్టెంబర్ 14న ఇద్దరు గల్లంతైన సంగతి తెలిసిందే. నాలాలో జారిపడి గల్లంతైన అర్జున్ (26), రాము (25) కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ క్రమంలో గురువారం మూసీనదిలో ఓ మృతదేహం లభ్యమైంది. మృతదేహంపై ఉన్న టాటూల ఆధారంగా అర్జున్‌గా గుర్తించారు. రాము కోసం గాలింపు కొనసాగుతోంది.
Heavy Rains | నిలిచిన ట్రాఫిక్
భారీ వర్షాల(Heavy Rains) కారణంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్‌పేట, గచ్చిబౌలి, హైటెక్‌సిటీ, ఎస్సార్‌నగర్, బేగంపేట, దిల్‌సుఖ్‌నగర్ తదితర ప్రాంతాల్లో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నీటితో నిండిన రోడ్లను క్లియర్ చేయడానికి, ప్రయాణికులకు సహాయం చేయడానికి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు(Hyderabad Traffic Police) నగరం అంతటా బృందాలను మోహరించారు. కీలకమైన జంక్షన్లలో ట్రాఫిక్‌ను నియంత్రించడం, నీటి తొలగింపు కోసం జీహెచ్ఎంసీ, హైడ్రా బృందాలతో సమన్వయం చేసుకోవడం, అత్యవసర కాల్‌లకు త్వరగా స్పందించడం ద్వారా మా బృందాలు 24 గంటలూ పని చేస్తున్నాయని పోలీసులు తెలిపారు. మరోవైపు, వరద సహాయక చర్యలను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) ఆదేశించారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పునరావాసం, విపత్తు ప్రతిస్పందన ప్రయత్నాలను మోహరించడంతో పాటు ఆర్థిక సహాయం కోసం కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని ఆదేశించారు.