అక్షరటుడే, వెబ్‌డెస్క్: Cyclone Montha | మొంథా తుపాన్ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్‌లో (Hyderabad) వర్ష బీభత్సంతో రోడ్లపైకి నీరు చేరింది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
తుపాన్ ఎఫెక్ట్‌తో నగరంలో బుధవారం ఉదయం నుంచి భారీ వర్షం (Heavy Rains) పడుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై నీరు నిలిచి చెరువులను తలపించాయి. దీంతో వాహనాలు నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. ముఖ్యంగా గచ్చిబౌలి, కొండాపూర్ ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉంది. ఆయా మార్గాల్లో ఆఫీసులకు వెళ్లే వారు రోడ్లపై అవస్థలు పడుతున్నారు. కూకట్పల్లి జేఎన్టీయూ నుంచి హైటెక్ సిటీ (Hi-tech City), రాయదుర్గం, మాదాపూర్, కేబుల్ బ్రిడ్జి, బయోడైవర్సిటీ, ఐకియా జంక్షన్ వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.
Cyclone Montha | జంట జలాశయాల గేట్లు ఓపెన్
వర్షాలతో నగరంలోని జంట జలాశయాలకు వరద వస్తోంది. దీంతో ముందు జాగ్రత్తగా జల మండలి అధికారులు హిమాయత్‌సాగర్, ఉస్మాన్ సాగర్ (గండిపేట్) గేట్లను ఎత్తారు. ఉస్మాన్‌సాగర్ (Osman Sagar) పది గేట్లను రెండు అడుగుల మేర, హిమాయత్‌సాగర్ నాలుగు గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. దీంతో మంచిరేవుల కల్వర్టుపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. పోలీసులు ఆ మార్గంలో రాకపోకలు నిలిపివేశారు.
Cyclone Montha | విరిగిపడిన కొండచరియలు
భారీ వర్షాలతో హైదరాబాద్ – శ్రీశైలం (Hyderabad – Srisailam) మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగి పడుతున్నాయి. దీంతో అధికారులు రాకపోకలు నిలిపివేశారు. జేసీబీ సాయంతో కొండచరియలను తొలగిస్తున్నారు. మరోవైపు ఖమ్మం, పాలేరు, భద్రాచలం, సత్తుపల్లిలో భారీ వర్షం కురుస్తోంది. మణుగూరు, ఇల్లందు, సత్తుపల్లి ఓపెన్ కాస్ట్ గనుల్లోకి నీరు చేరింది. దీంతో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.
