HomeతెలంగాణWeather Updates | నేడు భారీ వర్ష సూచన.. పలు జిల్లాలకు అలెర్ట్​

Weather Updates | నేడు భారీ వర్ష సూచన.. పలు జిల్లాలకు అలెర్ట్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | రాష్ట్రాన్ని వరుణుడు వీడటం లేదు. గత నాలుగు రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో శనివారం తెలంగాణలో భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తాయని వాతావరణ శాఖ (IMD) అధికారులు హెచ్చరించారు. 17 జిల్లాలకు ఆరెంజ్‌, 16 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ జారీ చేశారు. ఆదిలాబాద్​, ఆసిఫాబాద్​, మంచిర్యాల, భూపాలపల్లి, పెద్దపల్లి, ములుగు, జగిత్యాల, నిర్మల్​, నిజామాబాద్​, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్​, నారాయణపేట, మహబూబ్​నగర్​ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు. మిగతా జిల్లాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయి. నగరంలో శనివారం వాతావరణం చల్లగా ఉంటుంది. రోజంతా చిరు జల్లులు కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడ మోస్తరు వాన పడుతుంది.

Weather Updates | మూసీకి పోటెత్తిన వరద

హైదరాబాద్​ (Hyderabad) నగరంలో మూసీ నది (Musi River) ఉధృతంగా ప్రవహిస్తుంది. వికారాబాద్​, రంగారెడ్డి జిల్లాల్లో కురిసిన భారీ వర్షానికి మూసీకి వరద పెరిగింది. నగరంలోని జంట జలాశయాలైన గండిపేట, హిమాయత్​ సాగర్​ గేట్లు ఎత్తడంతో మూసీకి వరద పోటెత్తింది. శుక్రవారం రాత్రి 22 వేల క్యూసెక్కుల ప్రవాహం నమోదు కాగా.. నేడు 30 వేల క్యూసెక్కులు దాటే అవకాశం ఉంది. ఇప్పటికే మూసారాంబాగ్ బ్రిడ్జిపై వరద పారుతోంది. దీంతో అధికారులు ఆ మార్గంలో రాకపోకలు నిలిపివేశారు. పురానాపూల్ బ్రిడ్జి వద్ద 13 ఫీట్ల ఎత్తులో మూసీ ప్రవహిస్తోంది. 30 ఏళ్ల తరువాత అత్యంత భారీగా మూసీ ప్రవాహం నమోదు అయినట్లు అధికారులు చెబుతున్నారు. వరదలో ఓ శివాలయం మునిగిపోగా.. పూజారి కుటుంబం గుడిపైకి చేరింది. హైడ్రా (Hydraa), జీహెచ్‌ఎంసీ (GHMC) సిబ్బంది వారికి ఆహారం అందించారు.

Weather Updates | జలదిగ్బంధంలో ఎంజీబీఎస్​

నగరంలోని ఎంజీబీఎస్ (MGBS)​ బస్టాండ్​కు వెళ్లే రెండు వంతెనలు నీట మునిగాయి. దీంతో బస్టాండ్​ జలదిగ్బంధంలో చిక్కుకుంది. అధికారులు బస్సుల రాకపోకలను నిలిపివేశారు. బస్టాండ్​లోని ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకు వచ్చారు. ఎంజీబీఎస్​కు వచ్చే బస్సులను దారి మళ్లించారు. పలు బస్సులను జేబీఎస్​ వరకే అనుమతి ఇస్తున్నారు.

Must Read
Related News