అక్షరటుడే, వెబ్‌డెస్క్: Weather Updates | రాష్ట్రంలో ఆదివారం భారీ వర్షం (Heavy Rain) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నాలుగు రోజుల నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వాన పడుతోంది. శనివారం ఉదయం నుంచి ముసురు పెట్టింది. సాయంత్రం కాస్త తెరిపినిచ్చిన వరుణుడు రాత్రి తన ప్రతాపం చూపాడు.
శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఈ రోజు కూడా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (Meteorological Department) అధికారులు హెచ్చరించారు. సంగారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ, వనపర్తి, మహబూబ్‌నగర్, గద్వాల్, నాగర్ కర్నూల్, నారాయణపేట్, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి కుండపోత వాన పడే అవకాశం ఉంది.
హైదరాబాద్ నగరంలో మధ్యాహ్నం వరకు వాతావరణం పొడిగా ఉంటుంది. సాయంత్రం, రాత్రి పూట వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం పడుతుంది. ఈ మేరకు నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా సాయంత్రం సమయంలో అత్యవసరం అయితేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని కోరారు.
Weather Updates | నాలుగు రోజులు ముసురు
రాష్ట్రంలో మళ్లీ ముసురు పెట్టనుంది. ఆగస్టు 14 నుంచి 17 వరకు రాష్ట్రవ్యాప్తంగా ముసురు వాన పడుతుందని అధికారులు తెలిపారు. పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిస్తాయని పేర్కొన్నారు. ఆ సమయంలో అన్ని జిల్లాల్లో వర్షాలు పడతాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Weather Updates | హైదరాబాద్ అతలాకుతలం
రాష్ట్రవ్యాప్తంగా శనివారం విస్తారంగా వర్షాలు పడ్డాయి. హైదరాబాద్ (Hyderabad) నగరంలో కుండపోత వాన కురిసింది. అబ్దుల్లాపూర్ మెట్లో అత్యధికంగా 116.5 మి.మీ వర్షం కురిసింది. వనస్థలిపురం, హయత్‌నగర్, బీఎన్‌రెడ్డి నగర్, ఎల్బీ నగర్, సరూర్ నగర్, రాజేంద్రనగర్, చాంద్రాయణ్‌గుట్ట ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. భారీ వర్షంతో మహా నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
Weather Updates | చెరువులు, వాగులకు జలకళ
రాష్ట్రంలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులకు జలకళ వచ్చింది. చాలా వరకు చెరువులు నిండుకుండల్లా మారాయి. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రానున్న రోజుల్లో భారీ వర్ష సూచన ఉండటంతో చెరువులు మత్తడి దూకనున్నాయి.