అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Weather Updates | రాష్ట్రాన్ని వానలు వదలడం లేదు. కుండపోత వానలు సృష్టించిన బీభత్సం నుంచి తెరుకోకముందే.. మళ్లీ వర్షాలు పడుతున్నాయి.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గత రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. సోమవారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిశాయి. మంగళవారం సైతం భారీ వానలు పడుతాయని వాతావరణ శాఖ (Meteorological Department) అధికారులు తెలిపారు. మంగళవారం నుంచి గురువారం వరకు కొన్ని ప్రాంతాల్లో కుండపోత వానలు కురుసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Weather Updates | ఆ జిల్లాలకు అలెర్ట్
ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాల్లో నేటి నుంచి మూడు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మంచిర్యాల, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి మెదక్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతాయి. మిగతా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయి.
హైదరాబాద్ (Hyderabad) నగరంలో తేలిక పాటి నుంచి మోస్తరు వానలు మాత్రమే పడుతాయి. ఉదయం నుంచి వాతావరణం మేఘావృతమై ఉంటుంది. సాయంత్రం, రాత్రి పూట వర్షం పడే అవకాశం ఉంది. ఇటీవల భారీ వర్షాలు పలు జిల్లాల్లో బీభత్సం సృష్టించినా.. హైదరాబాద్‌లో మాత్రం పడలేదు. దీంతో నగరవాసులు ఊపిరి పీల్చుకున్నారు.
Weather Updates | దంచికొట్టిన వాన
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు భారీ వర్షాలు పడ్డాయి. ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లో 107.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఇచ్చోడలో 103.8, గుడి హట్నూర్ 97.5, తలమడ్ల 92.0, ఆసిఫాబాద్ జిల్లా కెరిమెరిలో 88.0, ఆదిలాబాద్ జిల్లా నార్నూర్‌లో 87.0 మి. మీ. వర్షపాతం నమోదు అయింది.