అక్షరటుడే, వెబ్డెస్క్ : Weather Updates | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన (LPA) ప్రభావంతో రాష్ట్రంలో ఐదు రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. మరికొద్ది గంటల్లో అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీంతో భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తాయని వాతావరణ శాఖ (Meteorological Department) అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం రోజంతా ముసురు వాన పడుతుందని పేర్కొన్నారు.
తెలంగాణలోని కామారెడ్డి, నిజామాబాద్, సిరిసిల్ల, సిద్దిపేట, కరీంనగర్, కరీంనగర్, జగిత్యాల, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, ములుగు, హన్మకొండ, సంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతాయి. మిగతా జిల్లాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయి. పలు జిల్లాల్లో ఉదయం నుంచే వర్షం పడుతోంది.
Weather Updates | హైదరాబాద్ నగరంలో..
హైదరాబాద్ (Hyderabad) నగరంలో సోమవారం ఉదయం నుంచి చిరుజల్లులు కురుస్తున్నాయి. రోజంతా నగరంలో ముసురు వాన పడనుంది. సాయంత్రం వరకు చిరుజల్లులు మాత్రమే పడుతాయి. సాయంత్రం, రాత్రిపూట మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Weather Updates | ములుగులో రికార్డు స్థాయి వర్షపాతం
ఆదివారం రాత్రి పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ములుగు (Mulugu) జిల్లాలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు అయింది. మూడు, నాలుగు గంటల వ్యవధిలోనే 200 మి.మీ. వర్షపాతం నమోదు కావడం గమనార్హం. దీంతో వాగులు ఉదృతంగా పారుతున్నాయి. జనజీవనం స్తంభించిపోయింది. మంగపేట, ఏటూరు నాగారం ప్రాంతాల్లో 200 మి.మీ. వర్షం కురిసింది.
Weather Updates | వర్షపాతం వివరాలు
రాష్ట్రంలో ఆదివారం ఉదయం 8:30 గంటల నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు కురిసిన వర్షపాతం వివరాలు.. సిద్దిపేట జిల్లా గౌరారంలో రికార్డు స్థాయిలో 235.8 మి.మీ. వర్షపాతం నమోదు అయింది. సిద్దిపేట జిల్లా ములుగు 186.3, మెదక్ జిల్లా ఇస్లాంపూర్ 178.5, కామారెడ్డి జిల్లా పిట్లం 173.3, మెదక్ జిల్లా కౌడిపల్లి 172.3, సంగారెడ్డి జిల్లా కంది 166, కామారెడ్డి జిల్లా హసన్పల్లిలో 164.3 మి.మీ. వర్షం కురిసింది.