అక్షరటుడే, వెబ్డెస్క్ : Rain Alert | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సోమవారం భారీ వర్షం (Heavy Rain) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గత వారం రోజులుగా రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సోమవారం కూడా ఎండ తీవ్రత అధికంగానే ఉండనుంది. అయితే సాయంత్రం పూట దక్షిణ తెలంగాణ (South Telangana)లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు వర్షాలు పడే ఛాన్స్ ఉంది. తేమతో కూడిన ఉక్కపోత ఉండనుంది. అనంతరం ఒక్కసారిగా వాతావరణం మారిపోయి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ (Hyderabad) నగరంలో కూడా వేడిగా ఉండనుంది. అయితే సాయంత్రం పూట చెదురుమదురు వానలు కురుసే ఛాన్స్ ఉంది.
Rain Alert | దంచికొట్టిన వాన
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ తీవ్రత ఉండగా.. సాయంత్రం, రాత్రివేళల్లో వర్షం పడింది. భువనగరిరి, నల్గొండ, ఖమ్మం, వరంగల్, సూర్యాపేట, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఆదివారం వర్షం పడింది. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో కూడా వర్షం పడింది. భువనగిరి జిల్లా వెర్కట్పల్లెల్లో అత్యధికంగా 107.8 మి. మీ. వర్షపాతం నమోదు అయింది. మహబూబాబాద్ జిల్లా దంతెపల్లిలో 105.8 మి.మీ., వరంగల్ జిల్లా లంకెపల్లిలో 105.5, భువనగిరి జిల్లా మోటాకొండురులో 97.3 మి.మీ. వర్షం కురిసింది.