అక్షరటుడే, వెబ్డెస్క్: Weather Updates | తెలంగాణ వ్యాప్తంగా వాన దంచికొట్టింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన (LPA) ప్రభావంతో రాష్ట్రంలో నాలుగు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం ఉదయం వరకు భారీవర్షాలు కురిశాయి. తెరిపినివ్వకుండా రాత్రంతా వాన పడుతూనే ఉంది. ఉదయం 9 గంటల తర్వాత పలు ప్రాంతాల్లో వర్షం కాస్త తగ్గింది. అల్ప పీడన ప్రభావంతో రాష్ట్రంలో మరో రెండు రోజులు భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో శనివారం భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిజామాబాద్, నిర్మల్, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాల్లో రానున్న ఆరు గంటలు అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. అనంతరం వరుణుడు కాస్త శాంతిస్తాడు. ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, జనగామ, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతాయి.
Weather Updates | హైదరాబాద్ నగరంలో..
హైదరాబాద్ (Hyderabad) నగరంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. కూకట్‌పల్లి, జగద్గిరిగుట్ట, మూసాపేట్, జేఎన్టీయూ, నిజాంపేట్ ప్రాంతాల్లో వాన దంచికొట్టింది. మిగతా ప్రాంతాల్లోనూ వర్షం పడడంతో నగర వాసులు అనేక ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు కాలనీల్లో ఇళ్లలోకి నీరు చేరింది. శనివారం కూడా నగరంలో వర్షం పడే ఛాన్స్ ఉంది. సాయంత్రం వరకు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాత్రి పూట మోస్తరు నుంచి భారీ వాన పడుతుంది.
Weather Updates | వర్షపాతం వివరాలు
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శనివారం రాత్రి కుండపోత వాన కురిసింది. ములుగు జిల్లా గోవిందరావుపేటలో అత్యధికంగా 151.3 మి.మీ, మేడారంలో 150.5, సంగారెడ్డి జిల్లా లక్ష్మిసాగర్లో 137, మంచిర్యాల జిల్లా కోటపల్లి 133, మెదక్ జిల్లా శివంపేట 128, వరంగల్ జిల్లా మేడిపల్లి 126.5, కామారెడ్డి జిల్లా రామారెడ్డిలో 123.3, ములుగు జిల్లా మంగపేట 118.8, మల్లూరులో 118 మి.మీ వర్షం కురిసింది.