అక్షరటుడే, ఇందూరు: Heavy Rains burust | రాష్ట్రానికి వానగండం పట్టుకుంది. ముఖ్యంగా కామారెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లాలపై కుండపోత వర్షం అతలాకుతలం చేస్తోంది.
నిన్న రాత్రి మొదలైన కుండపోత కామారెడ్డి, మెదక్‌పై ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ రోజు (ఆగస్టు 27) ఉదయం 8.30 గంటల వరకల్లా ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్లో 25 సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది. నిజాంసాగర్ మండలంలోనూ 18 సెం.మీటర్ల వర్షపాతం నమోదు కావడం గమనార్హం. ఇక ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలు ఈ గణాంకాలకు అదనం.
Heavy Rains burust | రెడ్ అలెర్ట్..
ఈ రోజు (ఆగస్టు 27) రాత్రి మరిన్ని అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో.. కామారెడ్డి (Kamareddy), నిజామాబాద్, మెదక్ (Medak) జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ ప్రకటించింది. అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రావొద్దని సూచించింది.
Heavy Rains burust | జంగంపల్లి వద్ద జాతీయ రహదారి మూసి వేత..
కామారెడ్డి పట్టణం జలదిగ్బంధంలో చిక్కుకుంది. నిజాంసాగర్ చౌరస్తాలోని (Nizamsagar Cowrastha) లయోల పాఠశాల, విద్యానగర్, రైల్వే బ్రిడ్జి ప్రాంతం, సిరిసిల్ల రోడ్డు (Sirisilla Road) రహదారులు నీటిలో మునిగిపోయాయి. పంచముఖి హనుమాన్ కాలనీలో వాహనాలు నీట మునిగాయి. బతుకమ్మ కుంట కాలనీలో ఇళ్లు నీట మునిగిపోయాయి. హౌజింగ్ బోర్డు కాలనీలో వాగు ప్రవాహానికి 5 కార్లు కొట్టుకుపోయాయి.
కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాల వల్ల 44వ నంబరు జాతీయ రహదారి (National Highway No. 44) పై ప్రమాదకరంగా వరద ఏరులై పారుతోంది. భిక్కనూరు వద్ద బొబ్బిలి చెరువు కట్ట తెగిపోవడంతో వరద పూర్తిగా జాతీయ రహదారికి అడ్డంగా పారుతోంది. దీంతో జంగంపల్లి వద్ద జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు.
Heavy Rains burust | పలు రైళ్ల రద్దు..
కామారెడ్డిలో వరద ఉద్ధృతికి రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. దీంతో సికింద్రాబాద్ – కామారెడ్డి మార్గంలో వెళ్లాల్సిన పలు రైళ్లను రద్దు చేశారు. మరి కొన్నింటిని దారి మళ్లించారు.
ప్రమాదం అంచున పోచారం ప్రాజెక్టు..
భారీవర్షాల కారణంగా వరద తాకిడితో పోచారం ప్రాజెక్టుకు భారీ వరద వచ్చి చేరుతోంది. కనీవినీ ఎరుగని రీతిలో వరద వస్తుండటంతో ప్రాజెక్టు అలుగు పై మీదుగా సుమారు 8 అడుగుల ఎత్తు నుంచి నీరు పారుతోంది. దీంతో ఎప్పుడు ఏం ప్రమాదం ముంచుకొస్తుందోనని అధికారులు, స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
ప్రాజెక్టు ఓవర్‌హెడ్ వద్ద గండి..
ప్రాజెక్టు ఓవర్‌హెడ్ (Project overhead) వద్ద భారీ గండి పడి అందులో నుంచి సైతం వరద ఉద్ధృతంగా దిగువకు ప్రవహిస్తోంది. ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో వరద బీభత్సం గంటగంటకు పెరుగుతోంది.
ప్రాజెక్టు చరిత్రలో అత్యధికంగా వరద వస్తోంది. ప్రస్తుతం జలాశయంలోకి 1,40,000 క్యూసెక్కుల వరద నీరు వస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
పోచారం ప్రాజెక్టు చరిత్రలోనే అత్యధికంగా వరద..
ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1.82 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టు నిండుగా మారడంతో పాటు జలాశయం పైనుంచి ఉప్పొంగి ప్రవహిస్తోంది. ప్రాజెక్టుపై 8 అడుగుల ఎత్తు నుంచి నీరు ప్రవహించడం ఇదే ప్రథమమని నీటిపారుదల శాఖ (Irrigation Department) అధికారులు పేర్కొంటున్నారు.
ఇప్పటివరకు 70,000 నుంచి 80,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చిన సందర్భాలు ఉన్నాయి.. ప్రస్తుతం లక్షా నలభై వేల క్యూసెక్కుల భారీ వరద రావడంతో ప్రాజెక్టు వద్ద ఆందోళన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ప్రాజెక్టు వద్ద గండిపడటంతో అధికారులను ఆందోళన కలిగిస్తోంది. ఏ క్షణంలో ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వాన్ని దుయ్యబట్టిన మాజీ మినిస్టర్ ప్రశాంత్ రెడ్డి
భారీ వర్షాల నేపథ్యంలో మాజీ మినిస్టర్ ప్రశాంత్ రెడ్డి (Former Minister Prashanth Reddy) స్పందించారు. పోచారం ప్రాజెక్టు పోటెత్తిన వరద ఉద్ధృతిపై మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. పోచారం ప్రాజెక్టుకు వరద పోటెత్తి సుమారు 12 గంటలు అవుతున్నా.. పోలీసులు తప్ప ప్రాజెక్టును రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు సందర్శించకపోవడం బాధాకరమని అన్నారు.
పోచారం ప్రాజెక్టు (Pocharam project) ప్రమాదం అంచున చేరిన విషయం తెలిసినా సర్కారు స్పందించకపోవడం సరికాదన్నారు. పోచారం ప్రాజెక్టుకు అనుకోని ప్రమాదం జరిగితే.. ఆ ప్రభావం కింద ఉన్న నిజాంసాగర్ ప్రాజెక్టుపై పడుతుందని మాజీ మంత్రి తెలిపారు. నిజాంసాగర్ ప్రాజెక్టుకు ఇప్పటికే వరద పోటెత్తిందని, పోచారం ప్రాజెక్టు వల్ల.. కింది నిజాంసాగర్ ప్రాజెక్టు కూడా ప్రమాదంలో పడుతుందని పేర్కొన్నారు.
ఈ విషయమై కామారెడ్డి కలెక్టర్‌తో మాట్లాడేందుకు ప్రయత్నిస్తే.. ఆయన స్పందించలేదని మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు.