అక్షరటుడే, ఎల్లారెడ్డి: Pocharam project | ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గత మూడు నాలుగు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జలాశయాలు, వాగులు, చెరువుల్లోకి నీళ్లు వచ్చి చేరుతున్నాయి. ప్రాజెక్టుల్లోకి ఇన్ఫ్లో వస్తోంది. కాగా.. ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్ మండలాల వరప్రదాయని అయిన పోచారం ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతాల నుండి గాంధారి పెద్దవాగు, తాడ్వాయి భీమేశ్వరం వాగుల ద్వారా 10 వేల క్యూసెక్కుల వరద ప్రాజెక్టులోకి వస్తోంది.
Pocharam project | పెరిగిన నీటిమట్టం
ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 20.5 అడుగులు కాగా.. ప్రస్తుతం 15.3 అడుగులకు చేరుకుంది. దీంతో రెండు మండలాల్లో పంటలకు నీరందనున్నాయి. కాలువ ద్వారా నేటి విడుదలకు సైతం అధికారులు ప్రణాళికలు తయారు చేస్తున్నారు. గతేడాది ఈ సమయానికి ప్రాజెక్ట్ పూర్తిస్థాయిలో నిండింది. కానీ ఈ ఏడాది వర్షాలు సకాలంలో కురవకపోవడంతో నేటికీ ప్రాజెక్టు నిండలేదు. కాగా.. ఇలాగే వర్షాలు కురిస్తే ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండి రెండు మండలాలల్లో పంటలకు నీరు అందుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తుండడంతో వాగులు, ప్రాజెక్టుల వద్దకు ప్రజలెవరూ వెళ్లకూడదని నీటిపారుదల శాఖ అధికారులు, పోలీసులు సూచిస్తున్నారు.