అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Venezuela | వెనెజువెలాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాజధాని కారకాస్‌లోని అధ్యక్ష భవనం పరిసరాల్లో కాల్పుల శబ్దాలు వినిపించడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
స్థానిక కాలమాన ప్రకారం రాత్రి 8 గంటల ప్రాంతంలో మొదలైన ఈ ఘటన దాదాపు 45 నిమిషాల పాటు కొనసాగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆ సమయంలో వరుసగా తూటాల శబ్దాలు వినిపించడమే కాకుండా, ఆకాశంలో డ్రోన్లు, విమానాలు తిరుగుతున్న శబ్దాలు కూడా వినిపించాయని స్థానికులు చెబుతున్నారు.ఈ ఘటన నేపథ్యంలో కారకాస్ (Caracas)లోని కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడినట్లు సమాచారం.
Venezuela | కాల్పుల కలకలం..
అకస్మాత్తుగా చీకటి అలముకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ప్రజలు ఇళ్లలోనే ఉండిపోయి బయటకు రావడానికి భయపడ్డారని తెలుస్తోంది. ప్రభుత్వ వర్గాల ప్రకారం, గుర్తు తెలియని డ్రోన్లు అధ్యక్ష భవనం సమీపంలో తిరుగుతున్నట్లు భద్రతా బలగాలు గుర్తించాయి. ఈ క్రమంలో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది గాల్లోకి హెచ్చరిక కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు తక్షణమే అదనపు బలగాలను మోహరించి భద్రతను కట్టుదిట్టం చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా నియంత్రణలో ఉందని వెనెజువెలా ప్రభుత్వం (Venezuelan Government) స్పష్టం చేసింది.
ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు ఇప్పటివరకు అధికారికంగా నిర్ధారణ కాలేదని అధికారులు తెలిపారు. అయితే కాల్పులు, డ్రోన్ల కదలికలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా (Social Media)లో విస్తృతంగా వైరల్ కావడంతో, అంతర్జాతీయంగా కూడా ఈ ఘటనపై ఆసక్తి నెలకొంది. కారకాస్‌లో జరిగిన ఈ పరిణామాలపై అమెరికా వైట్ హౌస్ స్పందించింది. అధ్యక్ష భవనం సమీపంలో జరిగిన కాల్పుల ఘటనకు అమెరికా (America)కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేసింది. పరిస్థితిని తాము నిశితంగా గమనిస్తున్నామని, అవసరమైతే మరిన్ని వివరాలు వెల్లడిస్తామని తెలిపింది. ఇదిలా ఉండగా, ఈ ఘటనపై సీఎన్ఎన్ కథనం వెలువరించింది. అధ్యక్ష భవనం వద్ద భద్రత నిర్వహించే పారామిలటరీ బలగాల మధ్య జరిగిన అపార్థం కారణంగానే కాల్పులు జరిగి ఉండొచ్చని ఆ కథనంలో పేర్కొంది. అయితే దీనిపై వెనెజువెలా ప్రభుత్వం ఇంకా అధికారికంగా స్పందించలేదు. ఈ ఘటనతో ఇప్పటికే రాజకీయంగా అస్థిరంగా ఉన్న వెనెజువెలాలో భద్రతా పరిస్థితులపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.