Rivers
Rivers | కృష్ణమ్మ పరవళ్లు.. గోదావరి ఉధృతి

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rivers | తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నదులైన గోదావరి (Godavari), కృష్ణ (Krishna)లకు భారీగా వరద వస్తోంది. ఆయా నదులపై గల అన్ని ప్రాజెక్టుల గేట్లు తెరిచి లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు.

కృష్ణానదిపై గల జూరాల ప్రాజెక్ట్​కు 2 లక్షల క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తోంది. దీంతో అధికారులు 26 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు విద్యుత్​ ఉత్పత్తి ద్వారా కూడా నీటిని వదులుతున్నారు. దీంతో శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. 2,33,202 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తుండగా అధికారులు 8 గేట్లు 10 అడుగులు ఎత్తారు. కుడి, ఎడమ గట్టు విద్యుత్​ కేంద్రాల్లో ఉత్పత్తి కొనసాగుతోంది. నాగార్జున సాగర్​ (Nagarjuna Sagar)కు 2,05,796 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తుండగా.. అధికారులు 20 గేట్లను ఓపెన్ చేశారు. పులిచింతల డ్యామ్ గేట్లు సైతం ఎత్తడంతో ప్రకాశం బ్యారేజీ (Prakasham Barrage) నుంచి లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వెళ్తోంది.

Rivers | బంగాళాఖాతంలోకి 2,900 టీఎంసీలు

ఈ ఏడాది గోదావరికి భారీగా వరద వస్తోంది. దీంతో ఆ నదిపై గల అన్ని ప్రాజెక్ట్​లు నిండాయి. మొదట్లో గోదావరికి ఎగువన ప్రవాహం లేక శ్రీరామ్​సాగర్​ ప్రాజెక్ట్​ వెలవెలబోయింది. అయితే దిగువన కాళేశ్వరం వద్ద మాత్రం వానాకాలం ప్రారంభం నుంచే గోదావరికి భారీగా ప్రవాహం మొదలైంది. ఆగస్టు చివరలో కురిసిన భారీ వర్షాలతో ఎగువన సైతం గోదావరి ఉగ్రరూపం దాల్చింది.

గోదావరిపై గల శ్రీరామ్​సాగర్ (Sriram Sagar)​ ప్రాజెక్ట్​లోకి ప్రస్తుతం 3,68,226 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తుండగా.. 51,560 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీరామ్​ సాగర్​ నుంచి వరద కాలువ ద్వారా మిడ్​ మానేరు, లోయర్​ మానేరు డ్యాంలను సైతం నింపారు. ఎల్లంపల్లి నిండుకుండలా ఉండటంతో ధవళేశ్వరం బ్యారేజీ (Davaleswaram Barrage) ద్వారా లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలో కలుస్తుంది. ఈ సీజన్​లో ధవళేశ్వరం బ్యారేజీ ద్వారా 2,900 టీఎంసీలు బంగాళాఖాతంలోకి వెళ్లినట్లు అధికారులు తెలిపారు. ఈ బ్యారేజీ నుంచి ప్రతి ఏడాది సాధారణంగా 2,850 టీఎంసీలు నీరు వృథాగా సముద్రంలోకి ప్రవహిస్తుంది. ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ నీరు సముద్రంలో కలిసింది. వరదలు కొనసాగుతుండటంతో 3 వేల టీఎంసీలకు చేరే అవకాశం ఉంది.