HomeతెలంగాణSriram Sagar | శ్రీరాంసాగర్​కు భారీ వరద.. 60 టీఎంసీలకు చేరిన నీటిమట్టం

Sriram Sagar | శ్రీరాంసాగర్​కు భారీ వరద.. 60 టీఎంసీలకు చేరిన నీటిమట్టం

- Advertisement -

అక్షరటుడే, ఆర్మూర్​ : Sriram Sagar | ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయని శ్రీరామ్​సాగర్ (SRSP)​కు వరద పోటెత్తింది. మహారాష్ట్రతో పాటు స్థానికంగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్ట్​లోకి భారీగా ఇన్​ఫ్లో వస్తోంది. దీంతో జలాశయం నీటిమట్టం వేగంగా పెరుగుతోంది.

అల్పపీడన ప్రభావంతో నిజామాబాద్​, నిర్మల్​ జిల్లాల్లో నాలుగు రోజులుగా వర్షం (Heavy Rains) దంచికొడుతోంది. దీంతో ఎస్సారెస్పీకి వరద వస్తోంది. శనివారం ఉదయం 6 గంటలకు 56,428 క్యూసెక్కుల ఇన్​ఫ్లో రాగా.. 9గంటలకు 89,466 క్యూసెక్కులకు పెరిగింది. మధ్యాహ్నం 3 గంటలకు 1,04,879 క్యూసెక్కుల ప్రవాహం రాగా.. ఆదివారం ఉదయానికి 1.51 లక్షలకు పెరిగింది.

Sriram Sagar | 24 గంటల్లో పది టీఎంసీలు

శ్రీరామ్​సాగర్​ ప్రాజెక్ట్​లోకి ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. ప్రాజెక్ట్​ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 (80.5 టీఎంసీలు) అడుగులు కాగా ప్రస్తుతం 1085.3 (60.825 టీఎంసీలు) అడుగుల నీరు ఉంది. 24 గంటల వ్యవధిలో ప్రాజెక్ట్​లోకి 10 టీఎంసీల నీరు చేరడం గమనార్హం. గతేడాది ఇదే సమయానికి ఎస్సారెస్పీలో 48.295 టీఎంసీల నీరు ఉంది.

ప్రస్తుతం ప్రాజెక్ట్​ నిండాలంటే.. మరో 20 టీఎంసీల నీరు అవసరం. ఎగువ నుంచి వరద ఇలాగే కొనసాగితే రెండు రోజుల్లో జలాశయం నిండుకుండలా మారే అవకాశం ఉంది. మరోవైపు నిజాంసాగర్ (Nizam Sagar)​కు కూడా ప్రవాహం వస్తోంది. ఆ ప్రాజెక్ట్​ గేట్లు ఎత్తితే శ్రీరామ్​ సాగర్​కు ఇన్​ఫ్లో మరింత పెరగనుంది. ప్రాజెక్ట్​లోకి భారీగా వరద వస్తుండటంతో రైతులు (Farmers) హర్షం వ్యక్తం చేస్తున్నారు. రెండు పంటలకు ఢోఖా ఉండదని పేర్కొంటున్నారు

Sriram Sagar | కాలువల ద్వారా నీటి విడుదల

శ్రీరామ్​ సాగర్​ ప్రాజెక్ట్​ నుంచి కాకతీయ కాలువ (Kakatiya Main Canal) ద్వారా 4 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు, అలీ సాగర్ ఎత్తి పోతలకు 180 క్యూసెక్కులు వదులుతున్నారు. ఆవిరి రూపంలో 594 క్యూసెక్కులు పోతుందని ఏఈఈ కొత్త రవి తెలిపారు. ప్రాజెక్ట్​కు భారీగా వరద వస్తుండటంతో దిగువన గోదావరి పరీవాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నదిలో చేపల వేటకు వెళ్లొద్దని, పశువుల కాపరులు, రైతులు నదివైపు వెళ్లొద్దని కోరారు.