అక్షరటుడే, వెబ్‌డెస్క్: Krishna River | ఎగువన కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణమ్మకు (Krishnamma) వరద పోటెత్తుతోంది. భారీగా వరద (Heavy Flood) వస్తుండడంతో నదిపై గల అన్ని ప్రాజెక్ట్‌ల గేట్లు ఎత్తి సముద్రంలోకి నీటిని వదులుతున్నారు. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ రిజర్వాయ్ల నుంచి జూరాల ప్రాజెక్ట్‌కు (Jurala Project) భారీగా వరద వస్తోంది. ఈ ఏడాది రెండు జలాశయాల నుంచి ఇప్పటి వరకు 308 టీఎంసీల నీరు జూరాలకు వచ్చింది. వర్షాకాలం ముగిసేలోపు మరో 300 టీఎంసీల నీరు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం నారాయణపూర్ డ్యాం నుంచి 1.1 లక్షల క్యూసెక్కులు, ఆల్మట్టి నుంచి 1.4 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు.
Krishna River | శ్రీశైలం 8 గేట్లు ఎత్తివేత
నారాయణపూర్, ఆల్మట్టి నుంచి భారీగా వరద వస్తుండడంతో జూరాల ప్రాజెక్ట్ గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి, వరద గేట్ల ద్వారా వచ్చిన వరదను వచ్చినట్లు శ్రీశైలం జలాశయానికి వదులుతున్నారు. జూరాల, సుంకేశుల ప్రాజెక్ట్‌ల నుంచి శ్రీశైలం డ్యామ్‌కు (Srisailam Dam) వరద పోటెత్తింది. ప్రస్తుతం 2.73 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుంది. కుడి, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రాల ద్వారా ఉత్పత్తి చేపడుతున్నారు. అలాగే 8 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ నుంచి మొత్తం 2.82 లక్షల క్యూసెక్కుల ఔట్ ఫ్లో నమోదవుతోంది.
Krishna River | ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి
నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ (Nagarjuna Sagar Project) ఇప్పటికే నిండుకుండలా మారింది. శ్రీశైలం నుంచి భారీగా వరద నీరు వస్తుండడంతో 26 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. విద్యుత్ ఉత్పత్తి సైతం కొనసాగుతోంది. పులిచింతల ప్రాజెక్ట్ సైతం నిండడంతో నాగర్జున సాగర్ నుంచి వచ్చిన నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో ప్రకాశం బ్యారేజీకి (Prakasam Barrage) భారీగా వరద వస్తోంది. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. 2,18,771 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండడంతో అధికారులు 70 గేట్లు ఎత్తి సముద్రంలోకి నీటిని విడుదల చేస్తున్నారు.