అక్షరటుడే, వెబ్డెస్క్ : Supreme Court | తెలంగాణలో మెడికల్ కాలేజీ (Medical College) సీట్ల భర్తీ విషయంలో రిజర్వేషన్ల (Local Reservations)పై వివాదం నెలకొంది. లోకల్, నాన్ లోకల్ అంశంపై పలువురు విద్యార్థులు కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టులో మంగళవారం వాదనలు ముగిశాయి. చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ (CJI BR Gavai) తీర్పును రిజర్వ్ చేశారు.
ప్రస్తుతం మెడికల్ కాలేజీల్లో సీట్ల భర్తీ కోసం దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష (NEET) నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అనంతరం రాష్ట్రాల వారీగా ర్యాంకులు రిలీజ్ చేస్తున్నారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక రిజర్వేషన్లను అమలు చేస్తూ సీట్లను భర్తీ చేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం స్థానికతను నిర్ధారించడానికి పలు నిబంధనలు పేర్కొంది. దీనిప్రకారం.. రాష్ట్రంలో వరుసగా 9, 10, 11, 12 తరగతులు చదివితేనే లోకల్ రిజర్వేషన్ వర్తిస్తుంది. ఈ నిబంధనను సవాలు చేస్తూ పలువురు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
Supreme Court | వేరే రాష్ట్రంలో ఇంటర్ చదివితే..
ప్రస్తుతం పదో తరగతి వరకు విద్యార్థులు సొంత రాష్ట్రంలో చదివిన విద్యార్థులు ఇంటర్ కోసం ఇతర రాష్ట్రాలకు సైతం వెళ్తున్నారు. ఇంటర్ వేరే రాష్ట్రంలో చదివిన తెలంగాణ విద్యార్థులకు లోకల్ రిజర్వేషన్ వర్తించడం లేదు. దీంతో కొంతమంది విద్యార్థులు గతంలో హైకోర్టును (High Court) ఆశ్రయించారు. ఆ పిటిషన్లను విచారించిన కోర్టు.. స్థానికతను నిర్ధారించడానికి నిబంధనలు రూపొందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం విచారణ చేపట్టింది.
Supreme Court | నాన్ లోకల్ ఎలా అవుతారు..
పదో తరగతి వరకు రాష్ట్రంలో చదివి ఇంటర్ కోసం రెండేళ్లు వేరే రాష్ట్రానికి వెళ్తే నాన్ లోకల్ ఎలా అవుతారని కోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వం తరఫున సీనియర్ లాయర్ అభిషేక్ సింఘ్వీ వాదించారు. ఈ నిబంధనతో సొంత రాష్ట్రంలోని విద్యార్థులకు అన్యాయం జరగొద్దని అభిప్రాయ పడింది. ఇరు వర్గాల వాదనలు పూర్తి కావడంతో తీర్పు రిజర్వ్ చేస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది.