అక్షరటుడే, వెబ్డెస్క్ : BC Reservations | స్థానిక సంస్థల ఎన్నికల్లో (Local Body Elections) బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై అత్యున్నత న్యాయస్థానం సోమవారం విచారణ చేపట్టనుంది. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో రిజర్వేషన్ల పరిమితి 50శాతానికి మించింది. 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేయొద్దని గతంలో సుప్రీం కోర్టు తీర్పు చెప్పంది. దీంతో ప్రభుత్వం తెచ్చిన జీవోకు వ్యతిరేకంగా తెలంగాణకు చెందిన వంగా గోపాల్ రెడ్డి అనే వ్యక్తి సుప్రీంకోర్టు (Supreme Court)లో పిటిషన్ వేశారు.
BC Reservations | సుప్రీం తీర్పుపై ఉత్కంఠ
బీసీ రిజర్వేషన్ల అంశంపై సుప్రీం విచారణ నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి ఢిల్లీకి వెళ్లారు. న్యాయనిపుణులతో వారు చర్చించనున్నారు. ఈ అంశంపై ప్రభుత్వం తరఫున సీనియర్ లాయర్లు అభిషేక్ సింఘ్వి, సిద్ధార్థ్ ధావే సుప్రీంకోర్టులో వాదించనున్నారు. రిజర్వేషన్ల అంశంపై బలంగా వాదనలు వినిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాము చిత్తశుద్ధితో ఉన్నామని చెప్పడానికి భట్టి, మంత్రులు ఢిల్లీకి వెళ్లారు. ఈ విషయమై సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) డిప్యూటీ సీఎంతో ఫోన్లో మాట్లాడారు. అయితే సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందోనని రాష్ట్ర ప్రజలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.
BC Reservations | తేలనున్న భవితవ్యం
సుప్రీంకోర్టు విచారణ అనంతరం బీసీ రిజర్వేషన్ల అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ అంశంపై హైకోర్టు (High Court)లో పిటిషన్ పెండింగ్లో ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 9 నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. దీంతో ఆశావహులు పోటీకి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే రిజర్వేషన్ల అంశం కోర్టులో ఉండటంతో చాలా మంది ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో సుప్రీం ఎలాంటి తీర్పు వెలువరిస్తోందనని ప్రభుత్వంతో పాటు ప్రజలు సైతం ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఒక వేళ సుప్రీంకోర్టు బీసీ రిజర్వేషన్లు చెల్లవని చెబితే ఎన్నికలు మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.