అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | చిన్నచిన్న అనారోగ్య సమస్యలు కూడా భారంగా మారకుండా హోంగార్డులకు బీమా అవసరమని అదనపు డీసీపీ రామచంద్రరావు (Additional DCP Ramachandra Rao) అన్నారు. సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) ఆదేశాల మేరకు శుక్రవారం జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో అదనపు డీసీపీ హోంగార్డుల ఆరోగ్య బీమాపై అవగాహన కల్పించారు.
యాక్సిస్ బ్యాంక్ మేనేజర్ హెల్త్ ఇన్సూరెన్స్ పథకాల (health insurance policies) గురించి, పోలీసు కుటుంబాల ఆరోగ్య భద్రతను బలోపేతం చేసే మార్గాలపై ప్రతిపాదనలు చేశారు. అనంతరం అదనపు డీసీపీ(ఏఆర్) మాట్లాడుతూ పోలీసు వ్యవస్థలో అత్యంత ముఖ్య భూమిక పోషించే హోంగార్డులు ఆరోగ్యంగా, ఆర్థికంగా భద్రంగా ఉండాలని సూచించారు.
సేవలో నిమగ్నమయ్యే సమయంలో ఎలాంటి అనారోగ్య సమస్య వచ్చినా, ఆరోగ్య బీమా మీకు రక్షణ కవచంలా నిలుస్తుందని చెప్పారు. చిన్నసమస్యలు పెద్దభారం కాకుండా ముందుగానే బీమా తీసుకోవడం ద్వారా కుటుంబాల భవిష్యత్తు పదిలమవుతుందన్నారు.
అందరికీ పూర్తి అవగాహనతో, నిర్భయంగా ఆరోగ్య బీమా తీసుకొని భద్రతను పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ హెచ్ సతీష్ (హోంగార్డ్స్), శేఖర్ బాబు (ఎంటీవో), కె.శ్రీనివాస్ (అడ్మిన్), తిరుపతి (వెల్ఫేర్), కార్పొరేట్ శాలరీ మేనేజర్ సి. వెంకటేష్, బ్యాంక్ అధికారులు, హోంగార్డులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
