అక్షరటుడే, కామారెడ్డి : Head Constable Suspension | పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ కృష్ణను సస్పెండ్ చేస్తూ ఇన్‌ఛార్జి డీఐజీ సన్‌ప్రీత్‌సింగ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణ స్పెషల్ బ్రాంచ్‌లో హెడ్ కానిస్టేబుల్ పనిచేస్తున్న సమయంలో టేకుల రాజయ్య పాస్‌పోర్టు దరఖాస్తు విచారణకు వచ్చింది. విచారణ సమయంలో కనీస ప్రాథమిక పరిశీలన చేయకుండానే కృష్ణ క్లియరెన్స్ ఇచ్చారు.
అయితే రాజయ్యకు అంతకుముందే రాజు అనే పేరుపై పాస్‌పోర్టు ఉంది. విచారణ చేయకపోవడంతో కృష్ణ ఈ విషయాన్ని గుర్తించలేదు. అయితే తర్వాత శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో రాజయ్యపై రెండు పాస్‌పోర్టులు కలిగి ఉన్నందుకు కేసు నమోదైంది. ఈ విషయంలో హెడ్ కానిస్టేబుల్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఎస్పీ రాజేశ్ చంద్ర ఇన్‌ఛార్జి డీఐజీకి నివేదిక పంపించారు. దీంతో ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని, సిబ్బంది పనితీరుపై నిరంతరం నిఘా ఉంటుందని ఇన్‌ఛార్జి డీఐజీ హెచ్చరించారు.
