అక్షరటుడే, వెబ్‌డెస్క్ : CP Sajjanar | ఐ బొమ్మ, బప్పం టీవీల నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ (Hyderabad CP Sajjanar) మీడియాకు వివరాలు వెల్లడించారు. అంతకు ముందు ఆయనతో పలువురు నిర్మాతలు, సినీ ప్రముఖులు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో భేటీ అయ్యారు. చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, దిల్ రాజు, సురేశ్‌బాబు ఆయన్ను కలిసి వివిధ అంశాలపై చర్చించారు.
CP Sajjanar | సీపీ సజ్జనార్ మాట్లాడుతూ..
పైరసీ (Piracy)తో సినీ ఇండస్ట్రీకి తీవ్ర నష్టం జరిగిందన్నారు. దీంతో హైదరాబాద్ పోలీసులు, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కలిసి పైరసీ ముప్పును అరికట్టాలనే సంకల్పంతో పని చేసినట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఐ బొమ్మ, బప్పం టీవీ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేశామని చెప్పారు.
ఇమ్మడి రవి తెలుగు పరిశ్రమకు చాలా నష్టం చేశారన్నారు. ఆయనపై సైబర్ క్రైమ్ పీఎస్‌లో నాలుగు కేసులు నమోదు అయ్యాయని వెల్లడించారు. ఐబొమ్మ ద్వారా పైరసీతో తెలుగు చిత్ర పరిశ్రమకు నష్టం చేసిన రవి.. బెట్టింగ్ యాప్ ప్రమోషన్లు చేసి ప్రజలకు సైతం నస్టం చేశారని చెప్పారు. బెట్టింగ్‌కు బానిసలుగా మారి ఎంతో మంది ఆత్మహత్య చేసుకున్నారన్నారు.
CP Sajjanar | తక్కువ అంచనా వేయొద్దు
దమ్ముంటే పట్టుకోండి అని పోలీసులకు సవాల్ విసిరిన రవి ఇప్పుడెక్కడున్నాడని సీపీ ప్రశ్నించారు. హైదరాబాద్ పోలీసు (Hyderabad Police)లను అంత తక్కువగా అంచనా వేయొద్దని హెచ్చరించారు. పోలీసులను, ప్రభుత్వాన్ని సవాల్ చేస్తే ఏమవుతుందో మీకు తెలుసన్నారు. ప్రజలు ఇలాంటి సైట్ల జోలికి పోవద్దని, సపోర్ట్ చేయొద్దని కోరారు. ఇమ్మడి రవి (Immadi Ravi)ని పట్టుకోవడానికి తమకు ఎవరు సమాచారం ఇవ్వలేదని ఆయన చెప్పారు. కాగా ఆయన భార్య సమాచారం ఇవ్వడంతో పోలీసులు పట్టుకున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. వీటిని సీపీ ఖండించారు. తామే నిఘా పెట్టి రవిని అరెస్ట్ చేశామన్నారు.
CP Sajjanar | 21 వేల సినిమాలు
రవి ఒక వెబ్సైట్ బ్లాక్ చేస్తే మరోటి మిర్రర్ చేసేవాడన్నారు. దాదాపు 65 మిర్రర్ సైట్లు నిర్వహించాడని సీపీ తెలిపారు. ఆయన హార్డ్ డిస్క్‌లను విశ్లేషించిన తర్వాత 21 వేల సినిమాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. 1972లో విడుదలైన గాడ్‌ఫాదర్ నుంచి మొన్న రిలీజ్ అయిన ఓజీ వరకు ఆయన హార్డ్ డిస్క్‌లో ఉన్నాయని చెప్పారు. ఐ బొమ్మ సైట్ (I Bomma Site) ద్వారా రూ.20 కోట్లు సంపాదించినట్లు రవి చెప్పాడన్నారు. తాము రూ.3 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఆయనను పోలీస్ కస్టడీకి తీసుకున్న తర్వాత మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని చెప్పారు. ఈ కేసులో అంతర్జాతీయ లింక్‌లు ఉన్నాయన్నారు.
CP Sajjanar | ప్రజల డేటా దుర్వినియోగం
ఇమ్మడి రవి వద్ద 50 లక్షల మంది ప్రజల డేటా ఉందని సీపీ చెప్పారు. ఈ డేటాను డార్క్‌వెబ్‌లో పెడుతున్నారని తెలిపారు. ఈ డేటాను మిస్‌యూజ్ చేసే అవకాశం ఉందని హెచ్చరించారు. దీని వెనుక పెద్ద రాకెట్ ఉందన్నారు. ఇలాంటి వెబ్సైట్లను ప్రజలు ఎంకరేజ్ చేయొద్దని కోరారు. వీటిని ఓపెన్ చేస్తే ప్రజల డేటా మొత్తం వారి చేతుల్లోకి వెళ్తుందన్నారు. దీనిని దుర్వినియోగం చేస్తారని హెచ్చరించారు.
CP Sajjanar | విదేశాల్లో సర్వర్లు
రవి వెబ్సైట్ డెవలప్మెంట్, డిజైనింగ్‌లో ఆరితేరాడన్నారు.అయితే పోలీసులు, సినీ ఇండస్ట్రీ (Film Industry) అతడి పట్టుకోవడానికి యత్నించడంతో నేవీస్ దేశం పౌరసత్వం కూడా తీసుకున్నారని చెప్పారు. ఈ దేశం కరేబియాన్ దీవుల్లో ఉందన్నారు. ఆయన సర్వర్లను విదేశాల ద్వారా నడుపుతున్నట్లు వెల్లడించారు.ఇమ్మడి రవికి ఎవరు సహకరించారనే వివరాలపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఆయన నెట్‌వర్క్‌లో ఉన్నవారిని అందరిని అరెస్ట్ చేస్తామన్నారు.
