అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Donald Trump | నోబెల్ శాంతి బహుమతిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా కాలంగా ఆశ పెట్టుకున్నారు. 2025 సంవత్సరానికి సంబంధించి నోబెల్ పీస్ ప్రైజ్‌ను శుక్రవారం ప్రకటించనున్న నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎనిమిది యుద్ధాలు నిలువరించిన తనకు నోబెల్ బహుమతి (Nobel Prize) వస్తుందో రాదోనని అన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా (Barack Obama) ఏమీ చేయకుండానే నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చారని అక్కసు వెల్లగక్కారు. అయితే, ఎనిమిది యుద్ధాలు ఆపిన తనకు వస్తుందో రాదోనన్నారు. మేలో జరిగిన ఇండియా, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణకు తానే మధ్యవర్తిత్వం వహించానని ఆయన పునరుద్ఘాటించారు.
Donald Trump | ఏం జరుగుతుందో తెలియదు..
వైట్ హౌస్‌లో విలేకరులతో మాట్లాడిన ట్రంప్.. నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకునే అవకాశాల గురించి అంచనాలను తోసిపుచ్చారు. కానీ శాంతి ఒప్పందాలు కుదర్చడంలో తాను సాధించిన రికార్డును నొక్కి చెప్పారు. ఇప్పటివరకు ఏడు యుద్ధాలను తాను పరిష్కరించానని, గాజాలో కాల్పుల విరమణతో కలిపి ఎనిమిది యుద్ధాలను నిలువరించానని పేర్కొన్నారు. నోబెల్ బహుమతిని అందుకునే అవకాశంపై ప్రశ్నించినప్పుడు.. ఏమి జరుగుతుందో తనకు తెలియదని ట్రంప్ (Donald Trump) అన్నారు, కానీ అంతర్జాతీయ దౌత్యంలో తాను సాధించిన విజయాలను వివరించారు.
Donald Trump | అవార్డుల కంటే ప్రాణాలే ముఖ్యం..
వాణిజ్య ఒత్తిడి, సుంకాలను ఉపయోగించి భారతదేశం, పాకిస్తాన్ మధ్య సైనిక వివాదాన్ని ముగిసేలా చేశానని తెలిపారు. అణు సంఘర్షణను ఆపడానికి నేను సుంకాలను ఉపయోగించానన్నారు. ఇండియా, పాకిస్తాన్ అణ్వస్త్ర దేశాలని, మేలో జరిగిన సైనిక వివాదం అణు యుద్ధానికి దారి తీసేదన్నారు. అయితే, వాణిజ్య చర్యలను ఉపయోగించి తాను జోక్యం చేసుకుని యుద్ధాన్ని నిలువరించానని మరోసారి చెప్పుకున్నారు.
నోబెల్ శాంతి బహుమతి గురించి వినయాన్ని వ్యక్తం చేస్తూ.. తన చర్యలు అవార్డులను గెలుచుకోవడం కంటే ప్రాణాలను కాపాడడమే లక్ష్యంగా పెట్టుకున్నాయని చెప్పారు. “వాళ్లు (నోబెల్ సెలక్షన్ కమిటీ) ఏమి చేయబోతున్నారో నాకు తెలియదు, కానీ నాకు ఇది తెలుసు. చరిత్రలో ఎవరూ తొమ్మిది నెలల కాలంలో ఎనిమిది యుద్ధాలను పరిష్కరించలేదు. నేను ఎనిమిది యుద్ధాలను ఆపాను. అది ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదు. కానీ వాళ్లు చేసేది చేయాలి. వాళ్లు ఏమి చేసినా పర్వాలేదు.నేను చాలా మంది ప్రాణాలను కాపాడాను కాబట్టి నేను అలా చేశాను,” అని ఆయన వివరించారు.