Homeబిజినెస్​HDFC Bank | హెచ్‌డీఎఫ్‌సీ డీలా.. నిరాశ పరిచిన క్యూ1 ఫలితాలు

HDFC Bank | హెచ్‌డీఎఫ్‌సీ డీలా.. నిరాశ పరిచిన క్యూ1 ఫలితాలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: HDFC Bank | ప్రైవేటు రంగానికి చెందిన యాక్సిస్‌ బ్యాంక్‌(Axis bank) త్రైమాసిక ఫలితాలు నిరాశ పరిచిన వేళ.. మిగిలిన ప్రైవేటు బ్యాంకుల ఫలితాలపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో వెలువడిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌(HDFC bank) ఫలితాలు కూడా అంచనాలకు తగ్గట్లుగా రాలేదు. బ్యాంక్‌ నికర లాభం క్షీణించడంతో మదుపరులు నిరుత్సాహానికి గురవుతున్నారు.

HDFC Bank | తగ్గిన నికర లాభం..

దేశంలో అతిపెద్ద ప్రైవేట్‌ బ్యాంకు(Largest private sector bank) అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ. 16,475 కోట్ల లాభాన్ని ఆర్జించగా.. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో రూ. 16,258 కోట్ల నికర లాభాన్ని(Net profit) నమోదు చేసింది. అంటే 1.31 శాతం నికర లాభం తగ్గిందన్నమాట. స్టాండలోన్‌ పద్ధతిన నికర లాభం రూ. 16,174 కోట్ల నుంచి రూ. 18,155 కోట్లకు పెరిగింది. పన్ను తర్వాత లాభం 12.24 శాతం పెరగడం గమనార్హం.

HDFC Bank | రెవెన్యూ..

బ్యాంకు మొత్తం ఆదాయం(Revenue) రూ. 83,701 కోట్ల నుంచి రూ. 99,200 కోట్లకు పెరిగింది. ఖర్చులు రూ. 59,187 కోట్ల నుంచి రూ. 63,467 కోట్లకు చేరాయి. నికర వడ్డీ మార్జిన్‌ 3.46 శాతం నుంచి 3.35 శాతానికి తగ్గింది. ప్రొవిజన్లు రూ. 2,602 కోట్ల నుంచి రూ. 14,442 కోట్లకు పెరిగాయి.
బ్యాంక్‌ స్థూల నిరర్థక ఆస్తులు(NPA) గతేడాది చివరి త్రైమాసికంతో పోలిస్తే 1.33 శాతం నుంచి 1.4 శాతానికి పెరిగింది.

HDFC Bank | బ్యాలెన్స్‌ షీట్‌..

ఈ ఏడాది జూన్‌ 30 నాటికి మొత్తం బ్యాలెన్స్‌ షీట్‌(Balance sheet) సైజ్‌ రూ. 39,54,100 కోట్లుగా ఉంది. గతేడాది ఇదే కాలంలో ఇది రూ. రూ. 35,67,200 కోట్లుగా ఉంది. బ్యాంక్‌ సగటు డిపాజిట్లు(Deposits) రూ. 26,57,600 కోట్లుగా నమోదయ్యాయి. గతేడాది రూ. 22,83,100 కోట్లతో పోల్చితే 16.4 శాతం ఎక్కువ.

స్థూల అడ్వాన్సులు రూ. 26,53,200 కోట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే త్రైమాసికం కంటే ఇది 6.7 శాతం ఎక్కువ. రిటైల్‌ రుణాలు 8.1 శాతం, చిన్న, మధ్య తరహా సంస్థల రుణాలు 17.1 శాతం, కార్పొరేట్‌, ఇతర టోకు రుణాలు 1.7 శాతం పెరిగాయి. మొత్తం అడ్వాన్సులలో విదేశీ అడ్వాన్సులు 1.7 శాతంగా ఉన్నాయి.

HDFC Bank | తొలిసారి బోనస్‌ ప్రకటన..

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు చరిత్రలో తొలిసారి బోనస్‌(Bonus) ఇవ్వాలని నిర్ణయించింది. బోనస్‌ను 1:1 నిష్పత్తిలో ఇవ్వనుంది. దీనికి రికార్డు డేట్‌ను ఆగస్టు 27గా ప్రకటించింది. అంటే ఆగస్టు 27 నాటికి ఎవరి డీమాట్‌ అకౌంట్‌లోనైతే హెచ్‌డీఎఫ్‌సీ షేర్లుంటాయో.. వారికి అన్ని షేర్లు అదనంగా జమ అవుతాయి. ఈ మేరకు షేరు ప్రైస్‌ అడ్జస్ట్‌ అవుతుంది.

కంపెనీ బోనస్‌తోపాటు ప్రత్యేక మధ్యంతర డివిడెండ్‌(Interim Dividend)ను కూడా ప్రకటించింది. ఒక్కో షేరుకు రూ. 5 డివిడెండ్‌ ఇవ్వనుంది. దీనికి ఈనెల 25 ను రికార్డు డేట్‌గా నిర్ణయించింది. డివిడెండ్‌ను ఆగస్టు 11న చెల్లించనుంది. క్యూ1 ఫలితాల తర్వాత బ్యాంక్‌ షేరు విలువ 1.48 శాతం తగ్గి 1,957 వద్ద స్థిరపడింది.

Must Read
Related News