అక్షరటుడే, వెబ్‌డెస్క్: Harley Davidson Zero Tax | భారత్, అమెరికాల మధ్య కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా భారత ఎగుమతులపై సుంకాలను అమెరికా 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గించగా.. పలు అమెరికన్ ఉత్పత్తుల దిగుమతులపై సుంకాలను భారత్ సున్నాకు తగ్గించనుంది. ఈ ఒప్పందంపై మార్చిలో సంతకాలు జరగనున్నాయి.
ఒప్పందం అమలు తేదీ నుంచి కొత్త సుంకాలు అమలులోకి రానున్నాయి. ఈ ఒప్పందంతో పలు అమెరికన్ మోటారు సైకిళ్ల ధరలు (American Motorcycle Prices) తగ్గనున్నాయి. 800 -1600 సీసీ ఇంజిన్ సామర్థ్యం కలిగిన మోటార్ సైకిళ్లపై ఎలాంటి సుంకాలు ఉండబోవని అధికార వర్గాలు ప్రకటించాయి. దీంతో హార్లే డేవిడ్సన్ (Harley Davidson) వంటి ప్రీమియం బైక్‌ల ధరలు గణనీయంగా తగ్గనున్నాయి.
ప్రస్తుతం హార్లే డేవిడ్సన్ కంపెనీ భారత్‌లో 12 మోడళ్ల బైక్‌లను విక్రయిస్తోంది. రూ. 2.34 లక్షలనుంచి రూ. 45.75 లక్షల వరకు (ఎక్స్‌షోరూం) వివిధ ధరల రేంజ్‌లలో అందుబాటులో ఉన్నాయి. కాగా.. హార్లే డేవిడ్సన్ స్పోర్ట్‌స్టర్ ఎస్ (Harley-Davidson Sportster S), హార్లే డేవిడ్సన్ నైట్‌స్టర్ (Harley-Davidson Nightster), హార్లే డేవిడ్సన్ నైట్‌స్టర్ స్పెషల్ (Harley-Davidson Nightster Special), హార్లే డేవిడ్సన్ పాన్ అమెరికా మోడళ్లపై ట్యాక్స్ జీరో కానుంది. ఆయా మోడళ్ల బైక్‌ల ధరలు గణనీయంగా తగ్గే అవకాశాలున్నాయి. కాగా హార్లే డేవిడ్సన్కు గతంలోనూ మన ప్రభుత్వం ఊరట కల్పించింది. 1600 సీసీ వరకు ఇంజిన్ సామర్థ్యం కలిగిన వాహన దిగుమతులపై 50 శాతంగా ఉన్న ఇంపోర్ట్ ట్యాక్స్‌ను గతేడాది 40 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే. 1600 సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం కలిగిన వాహనాలపై 50 శాతం సుంకాన్ని 30 శాతానికి కుదించారు. హర్లే డేవిడ్సన్ వంటి ప్రీమియం బైకులపై ట్యాక్స్ జీరోకు తగ్గడంతో ఆయా బైకులు కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి ఇది ఊరటనిచ్చే అంశం.