అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Harish Rao | రేవంత్‌రెడ్డి అంటే ద్రోహి, వెన్నుపోటు అని మాజీ మంత్రి హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటన వెలువడడంతో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో విజయ్ దివస్ (Vijay Diwas) నిర్వహించారు.
తెలంగాణ భవన్ (Telangana Bhavan)లో మంగళవారం హరీశ్‌రావు మాట్లాడారు. నవంబర్ 29న కేసీఆర్ దీక్ష చేపట్టడంతో దిగొచ్చిన నాటి కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 9 ప్రకటన చేసిందన్నారు. అనంతరం సమాఖ్య పాలకులకు తలొగ్గి డిసెంబర్ 23 ప్రకటన చేశారని గుర్తు చేశారు. నాడు సోనియా గాంధీ బలి దేవత అన్న రేవంత్‌రెడ్డి నేడు దేవత అంటున్నారని విమర్శించారు. డిసెంబర్ 9 ప్రకటన చేసినందుకు సోనియా గాంధీని పొగుడుతున్న రేవంత్ 23 ప్రకటన సందర్భంగా తెలంగాణ విద్రోహ దినంగా జరపాలన్నారు. ఇచ్చిన తెలంగాణను వెనక్కి తీసుకున్నారనే చర్చను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.
Harish Rao | కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారు
ప్రజల ఆశీర్వాదంతో మాజీ సీఎం కేసీఆర్ (KCR) ఆరోగ్యంగా ఉన్నారని హరీశ్‌రావు పేర్కొన్నారు. బయటకు ఎప్పుడు రావాలో ఆయనకు తెలుసన్నారు. కేసీఆర్ పాలన మళ్లీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. కేసీఆర్ దీక్ష లేకపోతే తెలంగాణ ప్రకటన వచ్చి ఉండేది కాదన్నారు. తెలంగాణ ఉద్యమ ద్రోహులు చరిత్ర రాస్తే.. రేవంత్ రెడ్డితోనే (CM Revanth Reddy) ప్రారంభించాల్సి ఉంటుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చే హక్కు ఆయనకు లేదని మండిపడ్డారు.
Harish Rao | ట్రంప్ పేరు ఎందుకు
హైదరాబాద్ (Hyderabad) నగరంలోని ఓ రోడ్డుకు ట్రంప్ పేరు పెడతామని ఇటీవల ప్రభుత్వం పేర్కొన్న విషయం తెలిసిందే. దీనిపై హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్ ఏం చేశారని రోడ్డుకు ఆయన పేరు పెడతారని ప్రశ్నించారు. ట్యాక్స్‌లు, టారిఫ్‌లు పెంచి, మన పిల్లలకు బేడీలు వేసి, ఫీజులు పెంచి ఇబ్బంది పెట్టినందుకు రోడ్డుకు ట్రంప్ పేరు పెడుతున్నారా అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. రవీంద్రభారతిలో ఇచ్చే కాళోజీ, దాశరథి, గద్దర్ అవార్డులను (Gaddar Awards) అవమానిస్తున్నారని విమర్శించారు.