అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Harish Rao Warning | మాజీ మంత్రి హరీశ్‌రావు పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో వచ్చేది బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం అన్నారు. బీఆర్ఎస్ నాయకుల విషయంలో అతిగా ప్రవర్తించే పోలీసులు చట్టపరంగా చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అప్పుడు ఎవరూ కాపాడలేరన్నారు.
మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ (Balka Suman)ను హరీశ్‌రావు గురువారం ఆదిలాబాద్ జైలు (Adilabad Jail)లో కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అక్రమంగా పోలీసులను అడ్డం పెట్టుకుని దొడ్డిదారిన అధికారం చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ యత్నిస్తోందని ఆరోపించారు. క్యాతనపల్లి, జనగామ, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లో బీఆర్ఎస్ నాయకులను, కౌన్సిలర్లను పోలీసు బలగాలతో భయభ్రాంతులకు గురిచేశారన్నారు. జనగామలో ఓటింగ్ కోసం తమ కౌన్సిలర్ చేయి పైకెత్తితే.. వెనుక నుంచి కాంగ్రెస్ కౌన్సిలర్లు చేతులు పట్టి లాగి బెదిరించే ప్రయత్నం చేశారన్నారు.
Harish Rao Warning | ప్రజాస్వామ్యం ఖూనీ
ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్కు స్పష్టమైన మెజార్టీ ఉన్నా ఎన్నికను అడ్డుకునే ప్రయత్నం చేశారని హరీశ్‌రావు విమర్శించారు. ఒక ఎంపీ అన్యాయంగా రెండోసారి తొర్రూరులో ఓటు నమోదు చేసుకోవడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ (Congress) నాలుగే మున్సిపాలిటీలు మాత్రమే గెలిచిందన్నారు. కానీ ప్రస్తుతం తాము 800 మంది కౌన్సిలర్లను గెలుచుకున్నట్లు చెప్పారు.
Harish Rao Warning | కావాలనే వాయిదా..
క్యాతనపల్లిలోని 22 స్థానాలకు 14 స్థానాలను బీఆర్ఎస్ గెలిచిందన్నారు. ఛైర్మన్ ఎన్నిక రోజు కావాలనే పోలీసు బందోబస్తు లేకుండా చేసి వాయిదా పడేలా చేశారని విమర్శించారు. బాల్క సుమన్, కోవ లక్ష్మిలను లోపలికి పంపించకుండా.. కాంగ్రెస్ మంత్రిని ఎలా పంపిస్తారని ప్రశ్నించినందుకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తమ నేతలపై దాడి చేశారన్నారు. మళ్లీ తమ పార్టీ వారిపై కేసులు నమోదు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.