అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Harish Rao | జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీశ్‌రావు స్పందించారు. ఇటీవల కవిత(Kalvakuntla Kavitha) ఆయనపై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
కాళేశ్వరం అవినీతిలో హరీశ్‌రావు పాత్ర ఉందని కవిత ఆరోపించారు. అంతేగాకుండా గజ్వేల్, కామారెడ్డిలో కేసీఆర్(KTR) ఓటమికి ఆయన ప్రయత్నాలు చేశారన్నారు. నిజామాబాద్ ఎంపీగా తనను ఓడించడానికి ఎమ్మెల్యేలతో కుట్ర పన్నారని ఆమె ఆరోపించిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీ నుంచి తనను సస్పెండ్ చేయించడానికి హరీశ్‌రావు(Harish Rao), సంతోష్‌రావు(Santosh Rao) కారణమని ఆమె ఆరోపించారు. వారు బీఆర్ఎస్ను హస్తగతం చేసుకోవడానికి కుట్ర చేస్తున్నారని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే ఆమె ఆరోపణలు చేసిన సమయంలో హరీశ్‌రావు లండన్‌లో ఉన్నారు. శనివారం ఉదయం హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఆయన కవిత వ్యాఖ్యలపై స్పందించారు.
Harish Rao | తెరిచిన పుస్తకం
తెలంగాణ(Telangana) ఉద్యమం నుంచి తన జీవితం తెరిచిన పుస్తకం అని హరీశ్ రావు అన్నారు. ఇటీవల తనపై, పార్టీపై కొందరు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇతర పార్టీలు చేస్తున్న ఆరోపణలనే కవిత చేశారని ఆయన అన్నారు. అయితే అవి ఎందుకు చేశారో, ఎవరి లబ్ధికోసం చేశారో ఆమె విజ్ఞతకే వదిలి వేస్తున్నానని హరీశ్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర పోరాటంలో తన నిబద్ధత అందరికీ తెలుసని ఆయన వ్యాఖ్యానించారు. క్రమశిక్షణ గల బీఆర్ఎస్ కార్యకర్తగా రెండున్నర దశాబ్దాలుగా తాను కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు.
Harish Rao | కేసీఆర్‌తో భేటీ!
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్(Former CM KCR)తో హరీశ్‌రావు భేటీ కానున్నట్లు తెలిసింది. కవిత వ్యాఖ్యల నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యత నెలకొంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఆరు రోజులుగా ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌లోనే ఉన్నారు. కవిత వ్యాఖ్యలపై ఇప్పటి వరకే కేసీఆర్, కేటీఆర్ స్పందించలేదు. ఆమెను సస్పెండ్ చేస్తున్నట్లు నేరుగా ప్రకటించకుండా.. మీడియాకు లేఖ విడుదల చేశారు. ఆమె ఎమ్మెల్సీ పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కవిత వ్యవహారంపై కేసీఆర్‌తో కేటీఆర్, హరీశ్‌రావు చర్చించనున్నట్లు సమాచారం.