అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Krishna Water Dispute | ఇండెంట్లు, బోర్డు అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా కృష్ణా నదీ జలాలను ఏపీ తీసుకుపోతుందని మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) అన్నారు. 80 శాతం నీళ్లు ఏపీ వాడుకుందని తెలంగాణ ఇరిగేషన్ శాఖ కేఆర్ఎంబీ (KRMB)కి లేఖ రాసిందన్నారు.
తెలంగాణ భవన్ (Telangana Bhavan)లో హరీశ్‌రావు మంగళవారం మీడియాతో మాట్లాడారు. కృష్ణా నీళ్లను ఏపీ తరలించుకుపోతుంటే ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. హక్కులు కాపాడాల్సిన కేఆర్ఎంబీ ఏపీని ప్రశ్నించడం లేదన్నారు. కేఆర్ఎంబీ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉందన్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేసీఆర్ మీద పడి ఏడ్వడం ఆపి, నీళ్ల విషయంలో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం మీద మాట్లాడాలన్నారు.
Krishna Water Dispute | రాష్ట్రానికి అన్యాయం
బీజేపీ, కాంగ్రెస్ రెండూ కలిసి రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తున్నాయని మాజీ మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్, కిషన్ రెడ్డి ఇద్దరూ కలిసి తెలంగాణ గొంతు పిసుకుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బ తీస్తే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. త్వరలో కేఆర్ఎంబీ ఆఫీసును ముట్టడిస్తామన్నారు. తెలంగాణ చరిత్రలో గత రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అత్యంత తక్కువ కృష్ణా జలాలు వినియోగించారని విమర్శించారు. రేవంత్ రెడ్డి (Revanth Reddy) తెలంగాణ నీళ్లను ఆంధ్రాకు తరలించి చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు సర్కార్ నడుపుతున్నారా.. సర్కస్ నడుపుతున్నారా అని విమర్శించారు.