అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Harish Rao | ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీతో సీఎం రేవంత్‌రెడ్డి ఫుట్‌బాల్ మ్యాచ్‌పై మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శలు చేశారు. మెస్సీ (Messi)తో మేస్త్రీ మ్యాచ్ కోసం రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు.
హైదరాబాద్ (Hyderabad) నగరంలోని కింగ్ కోఠి ఆస్పత్రిని శనివారం ఉదయం హరీశ్‌రావు సందర్శించారు. బాగ్‌లింగంపల్లి (Baglingampally) మైనార్టీ గురుకులంలో పులువురు విద్యార్థులు శుక్రవారం అస్వస్థతకు గురయ్యారు. వారు కింగ్ కోఠిలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. హరీశ్‌రావు వారిని పరామర్శించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నొప్పి వస్తుందని చిన్నారులు ఏడుస్తున్నా ఇంకా స్కానింగ్ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.
Harish Rao | విద్యార్థులను పట్టించుకోని ప్రభుత్వం
రాష్ట్ర ప్రభుత్వం (State Government) విద్యార్థులను పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాగ్ లింగంపల్లి గురుకుల విద్యార్థులు 90 మంది కలుషిత ఆహారంతో అస్వస్థతకు గురైతే, ముఖ్యమంత్రికి, మంత్రులకు చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. ఒక్కరు కూడా ఆ పిల్లలను పరామర్శించలేదన్నారు. అందరూ ఫుట్ బాల్ ఆడడంలో బిజీగా ఉన్నారని విమర్శలు చేశారు.
సీఎస్ఆర్, సింగరేణి డబ్బులతో రేవంత్‌రెడ్డి ఫుట్‌బాల్ (Football)షోకులు తీర్చుకుంటున్నారని ఆరోపించారు. పెద్ద పెద్ద కంపెనీలపై ఒత్తిడి చేసి రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నారని చెప్పారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం విద్యార్థులను పట్టించుకోవడం లేదన్నారు. కబ్జాలు, కమిషన్లకే సీఎం, మంత్రులకు సమయం సరిపోవడం లేదన్నారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో 116 మంది గురుకుల విద్యార్థులు చనిపోయారని పేర్కొన్నారు.
Harish Rao | విజన్ కాదు.. పాయిజన్ 2047
రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) విజన్ 2047 అంటున్నాడు.. కానీ ఇది పాయిజన్ 2047 అని హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రతి రోజు ఏదో ఒక మూలలో కలుషిత ఆహారంతో పిల్లలు ఆస్పత్రి పాలు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అస్వస్థతకు గురైన పిల్లలు తిరిగి గురుకులాలకు వెళ్లాలంటే భయపడుతున్నారని చెప్పారు.