HomeతెలంగాణHarish Rao | తెలంగాణ‌లో ఎమ‌ర్జెన్సీ తరహా పాలన.. ఓయూ విద్యార్థుల అరెస్టుల‌పై హ‌రీశ్ ఫైర్‌

Harish Rao | తెలంగాణ‌లో ఎమ‌ర్జెన్సీ తరహా పాలన.. ఓయూ విద్యార్థుల అరెస్టుల‌పై హ‌రీశ్ ఫైర్‌

- Advertisement -

అక్షరటుడే, వెబ్​బెస్క్ : Harish Rao | ఉస్మానియా యూనివ‌ర్సిటీలో ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో విద్యార్థుల‌ను ముంద‌స్తు అరెస్టు చేయ‌డం అప్ర‌జాస్వామిక‌మ‌ని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు (Harish Rao)మండిప‌డ్డారు. తెలంగాణ‌లో ఏమైనా నిషేధాజ్ఞ‌లు విధించారా? అని ప్ర‌శ్నించారు.

అరెస్టులు అప్రజాస్వామికమని, పిరికిపంద చర్య అన్న హ‌రీశ్‌రావు.. ఒక్క విద్యార్థిపై లాఠీ ప‌డినా తెలంగాణ స‌మాజం చూస్తూ ఊరుకోద‌ని హెచ్చ‌రించారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జాబ్ క్యాలెండ‌ర్‌ను జాబ్ లెస్ క్యాలెండ‌ర్‌(Jobless Calendar)గా మార్చిన ఘ‌న‌త కాంగ్రెస్‌కే ద‌క్కింద‌ని ఎద్దేవా చేశారు. సోమవారం ఉస్మానియా యూనివర్సిటీలో ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాలను సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రారంభించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో కొంత మంది విద్యార్థి నేత‌ల‌ను పోలీసులు ముంద‌స్తుగా అరెస్టు చేశారు. దీనిపై హ‌రీశ్‌రావు స్పందిస్తూ ‘ఎక్స్‌’లో పోస్టు పెట్టారు.

Harish Rao | నిల‌దీస్తార‌నే భ‌యంతోనే..

ఉస్మానియా యూనివ‌ర్సిటీ(Osmania University)కి సీఎం వెళ్తే ఎన్నిక‌ల ముంద‌ర ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయ‌మ‌ని విద్యార్థులు నిల‌దీస్తార‌నే భ‌యంతోనే ఓయూ విద్యార్థుల‌ను అరెస్టు చేస్తున్నార‌ని హ‌రీశ్ విమ‌ర్శించారు. కాంగ్రెస్ చెప్పిన ప్ర‌జాస్వామ్య పాల‌న అంటే ఇదేనా? అని ప్ర‌శ్నించారు. విద్యార్థులే కాదు.. యావత్ తెలంగాణ మీ మోసపూరిత హామీలపై నిలదీస్తుందని, అలాగైతే మొత్తం తెలంగాణ సమాజం మీద నిషేధాజ్ఞలు విధిస్తారా? అంటూ ప్ర‌శ్నించారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ రోజులను సీఎం రేవంత్ రెడ్డి తీసుకు వచ్చారని విమర్శించారు.

Harish Rao | నిరుద్యోగుల‌కు కాంగ్రెస్ ఢోకా

అధికారంలోకి రాగానే ల‌క్ష‌ల ఉద్యోగాలు భ‌ర్తీ చేస్తామ‌ని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల‌ను మోస‌గించింద‌ని హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు. 22 నెల‌ల పాల‌న‌లో ఉద్యోగాల భ‌ర్తీకి ఏం చ‌ర్య‌లు చేప‌ట్టార‌ని ప్ర‌శ్నించారు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాల నోటిఫికేషన్ల‌కు నియామక పత్రాలు ఇవ్వడం.. అలాగే కేసీఆర్ హయాంలో ఉస్మానియా యూనివర్సిటీలో శంకుస్థాపన చేసిన నిర్మాణాలను ప్రారంభించడం తప్ప గత 22 నెలలుగా నువ్వు చేసింది ఏముందని రేవంత్‌రెడ్డిని ప్ర‌శ్నించారు. జాబ్ క్యాలెండర్‌ను.. జాబ్ లెస్ క్యాలెండర్‌గా చేశారంటూ వ్యంగ్యంగా అన్నారు. మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలని చెప్పి మోసం చేశారని.. నిరుద్యోగ భృతి పేరిట నయవంచన చేశారని.. అలాగే 22 నెలల్లో 10 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా 60 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని నిప్పులు చెరిగారు.

Harish Rao | స‌ర్కారు అరాచ‌కం

హామీల‌పై నిల‌దీస్తున్న వారిపై ప్ర‌భుత్వం అక్ర‌మ కేసులు బ‌నాయిస్తోంద‌ని హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు. కాంగ్రెస్ అంటేనే అరాచ‌క పాల‌న అని నిరూపించుకుంటున్నార‌న్నారు. నీ తప్పుడు ప్రచారంపై కడుపు మండిన విద్యార్థులు, నిరుద్యోగులు ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నార‌న్నారు. నెలల తరబడి విద్యార్థులు, నిరుద్యోగులు నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తుంటే ముఖ్య‌మంత్రి ఢిల్లీకి చక్కర్లు కొడుతూ కాలం వెళ్ల దీస్తున్నాడ‌న్నారు. గ్రంథాలయాల్లో పోలీసు లాఠీ చార్జీలు జరిపించిన అరాచక చరిత్ర కాంగ్రెస్(Congress) ప్రభుత్వానిదన్నారు. విద్యార్థులు, నిరుద్యోగుల వీపులు పగుల గొట్టిన అమానుష పాలన కాంగ్రెస్ ప్రభుత్వానిదని పేర్కొన్నారు. ఆంక్షలతో, నిషేధాలతో నిరుద్యోగుల హృదయాల్లో రగులుతున్న నిరసన జ్వాలలను చల్లార్చలేరన్నారు. ఇనుప కంచెలు, బ్యారికెడ్లతో ప్రజా తిరుగుబాటును ఆపలేరని స్పష్టం చేశారు.