అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy | ఫైనాన్స్ కంపెనీలో (Finance Company) తీసుకున్న రుణం తీరిపోయిందని, ఎన్వోసీ ఇచ్చినా థర్డ్ పార్టీ వ్యక్తులు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఓ బాధితుడు వాపోయాడు. ఈ క్రమంలో సంబంధిత ఫైనాన్స్ కంపెనీ బ్రాంచ్ కార్యాలయంలో ఆందోళన చేపట్టాడు.
Kamareddy | వివరాల్లోకి వెళ్తే..
కామారెడ్డి మండలం క్యాసంపల్లి తండాకు (Kyasampally Thanda) చెందిన ఇస్లావత్ రాజు 2020లో కామారెడ్డి మున్సిపాలిటీ (Kamareddy Municipality) పరిధిలోని ఓ ఫైనాన్స్ కంపెనీలో రూ.7 లక్షల రుణం తీసుకున్నాడు. రెండు నెలల క్రితమే ఫైనాన్స్ రుణం పూర్తిగా చెల్లించడంతో కంపెనీ నుంచి ఎన్వోసీ కూడా వచ్చింది. అయితే రుణం ఇంకా చెల్లించాలంటూ నెలన్నర క్రితం కామారెడ్డి పట్టణంలో కంపెనీకి సంబంధం లేని ఐదుగురు వ్యక్తులు తన కారు ఆపి తనపై దాడికి పాల్పడ్డారని బాధితుడు ఆరోపించాడు. దీంతో వారిని పోలీసులకు పట్టించామని తెలిపారు. అయినప్పటికీ మరోసారి మేడ్చల్‌లో (Medchal) కారు ఆపారని, గట్టిగా మాట్లాడితే వెళ్లిపోయారని పేర్కొన్నాడు. మూడోసారి హైదరాబాద్‌లోనూ (Hyderabad) కూడా కారు ఆపారని చెప్పాడు.
మరోసారి శుక్రవారం కామారెడ్డి పట్టణంలో ఓ నలుగురు వ్యక్తులు కారు ఆపి డబ్బులు చెల్లించాలని ఇబ్బందులు పెట్టారన్నారు. ఈ విషయమై పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు బాధితుడు పేర్కొన్నాడు. శనివారం దేవునిపల్లిలోని సదరు ఫైనాన్స్ కంపెనీ బ్రాంచ్ కార్యాలయంలో ఆందోళన చేపట్టాడు. రుణం మొత్తం చెల్లించినా, ఎన్వోసీ తీసుకున్నప్పటికీ కారు ఆపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించాడు. తమకు న్యాయం చేయాలని కోరాడు.