అక్షరటుడే, వెబ్డెస్క్: Hair growth | అందం అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఒత్తైన, నల్లని జుట్టు. ముఖ సౌందర్యాన్ని రెట్టింపు చేయడంలో కేశాల పాత్ర అత్యంత ప్రధానమైనది. అయితే దురదృష్టవశాత్తూ.. నేటి యాంత్రిక జీవనంలో జుట్టు రాలడం అనేది ఒక తీవ్రమైన సమస్యగా మారింది.
పోషకాహార Nutritional లోపం, మానసిక ఒత్తిడి, పెరిగిపోతున్న కాలుష్యం, రసాయనాలతో కూడిన షాంపూల వాడకం వల్ల చిన్న వయసులోనే జుట్టు పల్చగా మారడం, బట్టతల రావడం వంటివి జరుగుతున్నాయి. మార్కెట్లో దొరికే ఖరీదైన హెయిర్ ఆయిల్స్ వాడి విసిగిపోయిన వారికి, మన వంటింట్లో లభించే ఉల్లిపాయ ఒక అద్భుతమైన సంజీవనిలా పనిచేస్తుంది.
Hair growth | ఉల్లి నూనె
ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ జుట్టు కుదుళ్లను బలోపేతం చేయడమే కాకుండా, రక్త ప్రసరణను మెరుగుపరిచి కొత్త జుట్టు మొలిచేలా చేస్తుంది. నిపుణుల సూచన ప్రకారం, రసాయనాలు లేని సహజసిద్ధమైన ఉల్లి నూనెను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ నూనె తయారీకి మనకు కేవలం మూడు వస్తువులు ఉంటే సరిపోతుంది.
- రెండు పెద్ద ఉల్లిపాయలు
- ఒక కప్పు స్వచ్ఛమైన కొబ్బరి నూనె pure coconut oil
- ఒక కప్పు నువ్వుల నూనె sesame oil
Hair growth | తయారీ విధానం
ముందుగా ఉల్లిపాయల onions ను శుభ్రం చేసి, పొట్టు తీసి చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఈ ముక్కలను మిక్సీలో వేసి మెత్తని పేస్టులా చేసుకోవాలి. పేస్ట్ మరీ గట్టిగా ఉంటే, కొద్దిగా కొబ్బరి నూనెను కలిపి గ్రైండ్ చేయవచ్చు. ఇప్పుడు ఒక మందపాటి గిన్నెను స్టవ్ మీద ఉంచి, అందులో తయారు చేసుకున్న ఉల్లిపాయ పేస్టుతో పాటు, మిగిలిన కొబ్బరి నూనె, నువ్వుల నూనెను పోయాలి.
మొదట పెద్ద మంటపై నూనెను వేడి చేసి, ఒక పొంగు రాగానే మంటను తగ్గించాలి . సుమారు 30 నిమిషాల పాటు తక్కువ మంట మీద ఈ మిశ్రమాన్ని మరిగించాలి. ఇలా చేయడం వల్ల ఉల్లిపాయలోని ఔషధ గుణాలన్నీ నూనెలోకి చేరుతాయి. నూనె రంగు మారి, ఉల్లిపాయ పేస్ట్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేయాలి.
భద్రపరచడం: నూనె పూర్తిగా చల్లారిన తర్వాత, ఒక పల్చని శుభ్రమైన వస్త్రాన్ని, వడకట్టే జాలిని ఉపయోగించి నూనెను వడకట్టాలి. దీనిని గాలి దూరని ఒక గాజు సీసాలో భద్రపరుచుకోవాలి. ఈ నూనెను ఫ్రిజ్లో ఉంచితే మూడు – నాలుగు నెలల పాటు పాడవకుండా ఉంటుంది. వారానికి రెండు, మూడు సార్లు ఈ నూనెతో కుదుళ్లపై మసాజ్ చేస్తే, జుట్టు రాలడం తగ్గి, ఒత్తుగా పెరుగుతుంది.
ప్రకృతి ప్రసాదించిన ఈ సహజమైన చిట్కాను క్రమం తప్పకుండా పాటిస్తే, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జుట్టును రక్షించుకోవచ్చు. రసాయనాలు వాడేకంటే, మన పూర్వీకులు చెప్పిన ఇలాంటి వంటింటి చిట్కాలే కేశ సౌందర్యానికి అసలైన శ్రీరామరక్ష.