అక్షరటుడే, వెబ్‌డెస్క్: H1B visa | అమెరికాలో ఉద్యోగ అవకాశాల (job opportunities) కోసం ఎదురుచూస్తున్న భారతీయ ఐటీ నిపుణులకు తీవ్ర నిరాశ కలిగించే వార్త ఇది. హెచ్-1బీ వీసా స్టాంపింగ్ (H-1B visa stamping) కోసం నిర్ణయించిన ఇంటర్వ్యూ అపాయింట్మెంట్లు 2027కు వాయిదా పడ్డాయి. కొత్త ఇంటర్వ్యూ స్లాట్లు అందుబాటులో లేకపోవడమే ఈ ఆలస్యానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఫలితంగా వేలమంది నైపుణ్యం కలిగిన వృత్తి నిపుణులపై తీవ్ర ప్రభావం పడనుంది.
H1B visa | యూఎస్ కాన్స్యులేట్లలో భారీ బ్యాక్లాగ్
భారతదేశంలోని అమెరికా కాన్స్యులేట్ (US consulates) కార్యాలయాల్లో వీసా దరఖాస్తుల నిరీక్షణ జాబితా గణనీయంగా పెరిగింది. దీంతో హెచ్-1బీ వీసా స్టాంపింగ్ ఇంటర్వ్యూల అపాయింట్మెంట్లు 2027 వరకు వాయిదా పడ్డాయి. గతంలో ఇంటర్వ్యూలు 2025 డిసెంబర్‌కు వాయిదా పడ్డాయి. అనంతరం 2026 మార్చి, అక్టోబర్ నెలలకు మారాయి. ప్రస్తుతం మరోసారి మార్పుతో 2027కు చేరాయి. ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా నగరాల్లోని కాన్స్యులేట్లలో కొత్త ఇంటర్వ్యూ స్లాట్లు అందుబాటులో లేవు. ఇప్పటికే బుక్ అయిన అపాయింట్మెంట్లను అధికారులు 18 నెలల పాటు వాయిదా వేయడంతో ఈ పరిస్థితి నెలకొంది.
H1B visa | వృత్తి నిపుణులపై తీవ్ర ప్రభావం
ఈ ఆలస్యం వల్ల వేల మంది భారతీయ వృత్తి నిపుణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే వీసా స్టాంపింగ్ కోసం భారత్‌కు వచ్చినవారు అమెరికాకు తిరిగి వెళ్లలేక చిక్కుకుపోయారు. ఉద్యోగ ఒప్పందాల్లో సమస్యలు, గృహ అద్దె ఒప్పందాలు రద్దవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి.
వీసా గడువు ముగిసిన కొందరు ఉద్యోగులకు కంపెనీలు పొడిగింపు ఇవ్వకపోవడం, లక్షల డాలర్ల ఫీజు భారం వల్ల కొత్త హెచ్-1బీ దరఖాస్తులు (new H-1B visa applications) సైతం తగ్గిపోతున్నాయి. జనవరి, ఫిబ్రవరి నెలల్లో అపాయింట్మెంట్లు ఉన్నవారికి కూడా ఈ–మెయిల్స్ ద్వారా ఏడాది తర్వాతి తేదీలు కేటాయిస్తూ సమాచారం అందింది. కాగా.. ప్రస్తుతం అమెరికాలో ఉన్న హెచ్-1బీ వీసా ఉన్నవారు స్టాంపింగ్ కోసం భారత్‌కు రావద్దని ఇమ్మిగ్రేషన్ నిపుణులు సలహా ఇస్తున్నారు. గత 50 రోజులుగా భారత్‌లో కొత్త వీసా ఇంటర్వ్యూ స్లాట్లు కనిపించడంలేదని చెబుతున్నారు.