అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Guvvala Balraju | అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీ గూటికి చేరనున్నారు. ఈ నెల 11వ తేదీన లేదా మరో రోజున ఆయన కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఇటీవలే బీఆర్ ఎస్ పార్టీకి రాజీనామా చేసిన గువ్వల శుక్రవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావును కలిశారు. హైదరాబాద్(Hyderabad) తార్నకలోని రాంచందరావు ఇంటికి వెళ్లిన ఆయన.. పార్టీలో చేరిక అంశంపై చర్చించారు. భేటీ ముగిసిన అనంతరం బీజేపీ చీఫ్ రాంచందర్ రావు(BJP State Cheif Ramchandra Rao).. గువ్వల బాలరాజు తమ పార్టీలో చేరుతున్నారని అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు తనను కలిసిన విలేకరులతో ఆయన బాలరాజు చేరికను ధ్రువీకరించారు. ఉదయం తన వద్దకు వచ్చి కలిశారని, పార్టీలో చేరతానని చెప్పారన్నారు. ఈ నెల 11వ తేదీన లేదా మరో మంచి రోజు చూసుకుని ఆయన కాషాయ కండువా కప్పుకుంటారని తెలిపారు. గువ్వలతో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ నాయకులు కూడా బీజేపీలో చేరే అవకాశం ఉంది.
Guvvala Balraju | బీఆర్ఎస్‌ను వీడి..
బీజేపీలో చేరనున్న గువ్వల ఇటీవలే బీఆర్ఎస్ పార్టీ(BRS Party)కి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ చీఫ్ కేసీఆర్‌కు ఆగస్టు 2వ తేదీన రాజీనామా లేఖ పంపించారు. ఆ తర్వాత నుంచి బీఆర్ఎస్‌పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. బీఆర్ఎస్ నాయకత్వం అసమర్థులను నమ్ముకుందని, తనను కుట్ర ప్రకారం ఓడించారని చెప్పారు. జనాల మద్దతు ఎవరికి ఉందో గుర్తించడంలో నాయకత్వం విఫలమైందని ఆరోపించారు. అలాగే, సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపైనా గువ్వల కీలక వ్యాఖ్యలు చేశారు. మొయినాబాద్ ఫాం హౌస్ కేసు(Moinabad Farmhouse Case)లో తాను కేవలం పాత్రధారిని మాత్రమేనని , సూత్రధారిని కానని చెప్పారు. నాడు కేసీఆర్ వెళ్లమని చెబితేనే తాను ఫాం హౌస్‌కు వెళ్లానని తెలిపారు. బీఆర్‌ఎస్ పార్టీ ఆదేశాల ప్రకారమే తనకు ఇచ్చిన రోల్‌ను ఫాంహౌస్‌లో పోషించానని, ఆ విషయం పార్టీ పెద్దలకు తెలుసని అన్నారు. తనను చంపుతానంటూ వేలాది ఫోన్లు వచ్చాయని, ఇంత జరిగినా బీఆర్ఎస్‌లో ఎవ్వరూ తనను పట్టించుకోలేదని బాలరాజు(Guvvala Balaraju) అన్నారు. ఫాం హౌస్ కేసులో రూ.వంద కోట్లకు అమ్ముడుపోయానంటూ తనపై అభాండాలు మోపారని ఆవేదన వ్యక్తం చేశారు.