అక్షరటుడే, భీమ్గల్: Velpoor mandal | వేల్పూర్ శివారులోని సాయిబాబా దేవాలయ (Sai Baba temple) ప్రాంగణంలో శనివారం పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని గోవిందగిరి స్వామి ధ్యాన మందిరంలో ‘గురుపాదుకా పూజ’ (Guru Paduka Puja) మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ఉదయం 5 గంటలకు బాబాకు కాగడ హారతితో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆలయ అర్చకులు అనురాగ్ పాండే ఆధ్వర్యంలో సాయిబాబా విగ్రహానికి పంచామృత అభిషేకం, విశేష అలంకరణ, హారతి కార్యక్రమాలు నిర్వహించారు. శివాలయం అర్చకులు భోనగిరి గంగాధర్ ఆధ్వర్యంలో గణపతి హోమం (శివపూజ యజ్ఞం) శాస్త్రోక్తంగా జరిగింది.
శ్రీ గోవిందగిరి స్వామి ధ్యాన మందిరంలో పట్టణానికి చెందిన గంధం ఇందిర-రాజేశ్వర్ దంపతులు గురుపాదుకా పూజ నిర్వహించారు. సాయి సేవకులు చేపట్టిన సామూహిక భజనలు భక్తులను ఆకట్టుకున్నాయి. అనంతరం మహా మంగళహారతి నిర్వహించి, భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఉత్సవాల ముగింపులో భారీ అన్నదానం నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, భజన కళాకారులు, స్వామి శిష్యులు, పెద్దసంఖ్యలో సాయి భక్తులు పాల్గొన్నారు.